
పర్యావరణంపై చైతన్యం అవసరం
జయపురం: పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం అవసరమని వక్తలు అన్నారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహిస్తున్న సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలల్లోని పాఠశాలల విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలకు శనివారం శ్రీకారం చుట్టారు. సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైకిళ్లపై జయపురం సమితి గొడొపొదర్ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పరిరక్షణలో గ్రామస్తులను మమేకం చేసి వారిచే మొక్కలు నాటించటం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సూచించారు. ఉభయ పాఠశాలల విద్యార్థులు పర్యావరణంపై ముఖాముఖి చర్చించుకుని ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శణలతో అలరించారు. సిటీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ పట్నాయక్ పర్యావరణ ఆవశ్యకతను వివరించారు. గొడొపొదర్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దిలీప్ పండ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి షోషియల్, ఎడ్యుకేషనల్ ఎన్విరాన్‌మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) అధ్యక్షులు సుధాకర పట్నాయక్, సీనియర్ సభ్యులు కె.మోహనరావు, జి.వెంకటరెడ్డి సహకరించగా సిటీ స్కూల్ ఉపాధ్యాయులు జి.సాయిశేఖర్, ధనపతి భొత్రలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.