
ఆశా కార్యకర్తల ఆందోళన
రాయగడ: ఆల్ ఒడిశా ఆశా కార్యకర్తల మహాసంఘం పిలుపు మేరకు జిల్లా ఆశా కార్యకర్తల సంఘం శనివారం ఆందోళన చేపట్టింది. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ఏడీఎం రమేష్ చంద్రనాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ముందుగా గాంధీ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సంఘం రాయగడ శాఖ అధ్యక్షురాలు తమల్ సాహుకార్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జోగేశ్వర్ దాస్, సభ్యుడు అరుణ్‌కుమార్ లెంక తదితరులు పాల్గొన్నారు.
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 డిసెంబర్ 12వ తేదీ నుంచి ప్రారంభవుతాయని రాష్ట్ర గిరిజన, ప్రాధమిక విద్యా, మైనారిటీ శాఖా మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి సమావేశ మందిరంలో శనివారం జరిగిన మండయ్ సన్నాహక సమావేశంలో ప్రసంగించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 16వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. మండయ్ శుభారంభం నవంబర్ 25వ తేదీన ఉమ్మర్‌కోట్ డివిజన్ డోడ్ర సమీపంలో పుడాఘఢ్ వద్ద ప్రారంభ పూజలు జరుగుతాయన్నారు. అనంతరం పంచాయతీ, సమితి, జిల్లా స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు ముగింపు వేడుకలలో తమ ప్రదర్శనలు ఇస్తారని మంత్రి గొండో ప్రకటించారు. సమావేశంలో నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు.