
విద్యుత్ భద్రతపై అవగాహన యాత్ర
జయపురం: విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగుల రక్షణ, భద్రతపై అవగాహనకు టీపీఎస్‌ఓడీఎల్ (టాటా పవర్ సప్లయ్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్) ఉద్యోగి ఇ.సౌమ్యరంజన్ లెంక జయపురం విద్యుత్ ఇంజినీరింగ్ విభాగ కార్యాలయం నుంచి శనివారం సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆయన జయపురం నుంచి వయా బరంపురం మీదుగా బలంగీర్ వరకు సైకిల్ యాత్ర చేస్తారు. జయపురం సర్కిల్ హెడ్ మన్మథనాథ్ మిశ్ర, దేబేస్ పండ, బిశ్వజిత్ మెండులి విద్యుత్ సురక్షా అధికారి ప్రమోద్ కుమార్ బెహరలు పచ్చ జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. విద్యుత్ వినియోగం, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ రక్షణ జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. సైకిల్ యాత్ర మధ్యలో గ్రామాలు, పట్టణాలు, విద్యాలయాలలో సౌరశక్తి సద్వినియోగం, విద్యుత్ సురక్షలపై పాదయాత్ర, సభలు, నిర్వహించి ప్రజలను, విద్యార్థులను సచేతనులను చేసేందుకు ప్రయత్నిస్తానని సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న లెంక వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఈఆర్‌టీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతోష్ కుమార్ మహంతి, చందన రెడ్డి, రాజేష్ కుమార్ సాహు, పరిమల పాల్, బిచిత్ర కుమార్ బెహర, రంధీర్ సింగ్ పాల్గొన్నారు.