
సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాల కొరత
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సంక్షేమ హాస్టల్‌లో మౌలిక వసతులు లేక విద్యార్థులు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఎం నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను సీపీఎం ప్రతినిధి బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థులు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ 31, బీసీ హాస్టల్స్ 78, ఎస్టీ హాస్టల్స్ 60 ఉన్నాయని, వీటిల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించని వారు జిల్లాలో విమానాశ్రయాలు నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తక్కువ మెనూ చార్జీలతో అరకొర భోజన సదుపాయాలు అందుతున్నాయన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు జిల్లా మంత్రులకు పట్టవా అని ప్రశ్నించారు. వర్షం పడితే ఎస్సీ హాస్టల్ మొత్తం నీటితో నిండిపోతుందని, ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఎస్టీ హాస్టల్‌కి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎస్టీ హాస్టల్‌లో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక్కో హాల్ ఉన్నాయని, అందులోనే 200 మంది విద్యార్థులందరూ సామూహికంగా నిద్రించడం, భోజనం చేయడం, చదువుకోవడం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం ప్రతినిధి బృందం నాయకులు ఎం.గోవర్ధనరావు, పి.సుధాకర్, కె.సూరయ్య, ఎల్.మహేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.