
ప్రత్యర్థుల్ని గౌరవించడం క్రీడాస్ఫూర్తి
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు
కంభంపాటి
భువనేశ్వర్: స్థానిక కళింగ స్టేడియంలో గురువారం 28వ ఐటీటీఎఫ్–ఏటీటీయూ ఆసియా టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్స్ 2025 ముగింపు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి మాట్లాడుతూ పతకాలను సాధించడంతో విజయం పరిమితం కాకుండా క్రీడా స్ఫూర్తితో ప్రత్యర్థులను గౌరవించడం ఇతరులను ప్రేరేపించడంలో దోహద పడుతుందన్నారు. ఈ పోటీ నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని, మొదటిసారిగా ఒడిశా ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇచ్చిందని, క్రీడల రాజధానిగా కళింగ స్టేడియం మరోసారి ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని అభినందించారు. గత 5 రోజులుగా కళింగ స్టేడియం అంతర్జాతీయ నైపుణ్య స్ఫూర్తి ఉత్సాహంతో ప్రతిధ్వనించడం తార్కాణంగా పేర్కొన్నారు. చాంపియనన్‌షిప్‌లో పురుషులు, మహిళల జట్ల టైటిళ్లను గెలుచుకోవడం ద్వారా చైనా మరోసారి ప్రపంచ టేబుల్ టెన్నిస్‌లో తన సత్తా ప్రదర్శించింది. ఈ సందర్భంగా లండన్‌లో జరగనున్న 2026 ఐటీటీఎఫ్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్‌లకు అర్హత సాధించిన జట్లను గవర్నర్ ప్రశంసించారు. టేబుల్ టెన్నిస్ ధైర్యం, స్థితిస్థాపకత, పట్టుదల నేర్పుతుందని డాక్టర్ కంభంపాటి అన్నారు. ఒక పాయింట్ కోల్పోయినప్పుడు కూడా, ఉత్తమ ఆటగాళ్లు ప్రశాంతమైన దృఢ సంకల్పంతో తిరిగి పుంజుకుంటారు. ఈ పట్టుదల జీవితంలో తిరిగి ఎదగ గలిగే మనోస్థైర్యం ప్రేరణకు ఉదాహరణగా పేర్కొన్నారు. క్రీడలు, యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం – సంస్కృతి, ఉన్నత విద్యా శాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్, క్రీడలు, యువజన సేవల విభాగం కమిషనర్, కార్యదర్శి సచిన్ జాదవ్, క్రీడలు మరియు యువజన సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ యెద్దుల విజయ ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రత్యర్థుల్ని గౌరవించడం క్రీడాస్ఫూర్తి