
సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
రాయగడ: మన సంస్కృతీ, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెమండొ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమీపంలో జిల్లా యంత్రాంగం, ఓర్మాస్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన దీపావళి సామాన్ల విక్రయ స్టాల్‌ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆనందాలకు, సంతోషాలకు దీపావళి వంటి పండగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అభిప్రాయపడ్డారు. ఓర్మాస్ ద్వారా ఈ ఏడాది దీపావళి సామాన్ల విక్రయ స్టాల్‌ను ఏర్పాటు చేశామని ఓర్మాస్ అధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఈ స్టాల్‌లో స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు సొంతంగా రూపొందించే వివిధ రకాల దీప ప్రమిదలు, కొవ్వొత్తులు, అగరబత్తులు తదితర వస్తువులు లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఇక్కడ తక్కువ ధరకు లభించే సామగ్రి కొనుగోలు చేసి ప్రోత్సాహించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.