
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి నలగంఠి పంచాయతీ ఎం.వి 72 గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య బుధవారం ధర్నాకు దిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తాపన్ మండల్ అనే వ్యక్తి బీఎస్‌ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2022లో ఎం.వి 61 గ్రామానికి చెందిన కరిష్మా విశ్వస్‌ను ప్రేమించాడు. తల్లిదండ్రుల అంగీకారంతో మల్కన్‌గిరిలోని మల్లికేశ్వర్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు మల్కన్‌గిరిలో ఓ అద్దె ఇంటిలో కాపరం పెట్టాడు. అక్కడ నుంచి తరచూ తాపన్ తల్లిదండ్రులు సునంద మండల్, తుషార్ మండల్ వచ్చి కోడుకు, కోడలు మధ్య గోడవలు పెట్టేవారు. దీంతో భార్యను విడిచిపెట్టి తపాన్ విధులకు వెళ్లిపోయాడు. రెండేళ్లు గడిచిన తరువాత ఎం.వి 79 పోలీసు స్టేషన్‌లో తనకు భర్త వదిలేశాడని కేసు పెట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి తపాన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. భర్యాభర్తలు కలిసి ఉండాలని కోర్టు ఆదేశించింది. కరిష్మాను తపాన్ భర్యగా, అత్తమామలు కోడలిగా అంగీకరించడం లేదు. దీంతో కరిష్మా భర్త ఇంటి ముందు వివాహ, కోర్టు ఇచ్చిన పత్రాలతో ధర్నాకు దిగింది. న్యాయం కోసం పోరాడుతోంది. కరిష్మాతోపాటు తల్లి కూడా ఉంది.