
నువాపడా ఉప ఎన్నికలో బీజేడీ నవీన వ్యూహం
● బీజేడీ అభ్యర్థి స్నేహాంగిని చురియా
భువనేశ్వర్: నువాపడా నియోజక వర్గం ఉప ఎన్నిక పురస్కరించుకుని రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ దాఖలు ఘట్టం ఆరంభం కావడంతో అభ్యర్థుల ఎంపిక పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ బీజేడీ ఫిరాయించిన జయ ఢొలొకియాను అభ్యర్థిగా ప్రకటించింది. మరో వైపు కాంగ్రెస్ ఘసిరాం మాఝీని బరిలోకి దింపింది. విపక్షం బిజూ జనతా దళ్ చిట్ట చివరి క్షణం వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఆశావహుల శీర్షికతో ఊహాగానాలు బలం పుంజుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నవీన్ నివాసంలో అంతరంగిక సమావేశాలు నిరవధికంగా కొనసాగాయి. ఎప్పటి మాదిరిగానే నవీన్ పట్నాయక్ తుది నిర్ణయం విశ్లేషకుల్ని సైతం ఖంగు తినిపించింది. నువాపడాలో గెలుపు గుర్రం అన్వేషణ కోసం నియమించిన స్నేహంగిని చురియా నువాపడా ఉప ఎన్నికకు బీజేడీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు ప్రకటించారు. నవీన్ పట్నాయక్ నువాపడా ఉప ఎన్నికకు స్నేహంగిని చురియాను ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పశ్చిమ ఒడిశాకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు స్నేహంగిని చురియా ప్రస్తుతం బిజూ మహిళా జనతా దళ్ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. షెడ్యూల్డ్ కుల సమాజానికి చెందిన ఆమె సామాజిక సమ్మిళితత్వం, మహిళా సాధికారత రెండింటినీ సూచిస్తుంది. బీజేడీ రాజకీయ విజయ గాథలో ఈ రెండు ప్రధాన అంశాలు కావడంతో ఆమె అభ్యర్థిత్వం ధీటైనదిగా పరిగణించారు. పోటీలో ఉన్న మూడు ప్రధాన పార్టీలలో ఆమె ఏకై క మహిళా అభ్యర్థి. పోటీలో ఆమెకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. మహిళలపై పెరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్థిరమైన వైఖరికి పేరు గాంచిన స్నేహంగిని చురియా రాష్ట్ర వ్యాప్తంగా బీజేడీ మహిళా విభాగంలో ముందంజ నాయకురాలిగా పేరొందింది. ఆమె క్షేత్ర స్థాయి సంబంధాలు, బీజేడీ మహిళా కార్యకర్తలను ఉత్తేజపరిచే సామర్థ్యం నువాపాడలో పార్టీ ప్రచారానికి శక్తినిస్తుందని భావిస్తున్నారు. నవీన్ పట్నాయక్ ఎంపిక నువాపడా ఉప ఎన్నికలో లింగ, ప్రాంతీయ, సామాజిక ప్రాతినిధ్యం వ్యూహాత్మక సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. ఈ చర్య బీజేడీ మహిళా నాయకత్వంపై ప్రాధాన్యతను కూడా పునరుద్ఘాటిస్తుంది.