
సైబర్ మోసాలపై అవగాహన
రాయగడ: సైబర్ మోసగాళ్ల బారినపడి ఎంతో మంది మోసపోతున్నారని, సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షించడంతోపాటు ఆయా నేరాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. బుధవారం వర్చువల్ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, ఎస్డీపీఓ గౌరహరి, సైబర్ సెల్ డీఎస్పీ అవినాష్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారి నుంచి అమాయక ప్రజల్ని కాపాడేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించి సైబర్ నేరస్తుల బారి నుంచి ప్రజలను రక్షించడం మన కర్తవ్యంగా భావించాలన్నారు. సైబర్ నేరాలను అదుపులోకి తీసుకురావాలంటే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయి నుంచి సమితి స్థాయి వరకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సైకల్ ర్యాలీలు, వివిధ రకాల పోటీలను నిర్వహించాలన్నారు.