
ఆన్‌లైన్‌లో అన్న ప్రసాదంపై వివాదం
భువనేశ్వర్: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ రాష్ట్రంలో అత్యంత ప్రముఖ దేవాలయాల నుంచి అన్న ప్రసాదం అమ్మకం, ఇంటి ముంగిట డెలివరీ ప్రకటనలు ప్రసార చేసి వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ప్రకటన పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం నుంచి అన్న మహా ప్రసాదం (ఒబొడ) మాత్రమే కాకుండా కెంజొహర్ జిల్లా ఘొటొగాంవ్ మా తరిణి, బాబా అఖండలమణి, ఇతర ప్రముఖ దేవాలయాల అన్న ప్రసాదాలను కూడా ఆన్‌లైన్‌లో బట్వాడా చేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో సెట్ ప్రసాదం ధర రూ. 49కు పరిమితంగా పేర్కొంది. ఈ ఆఫర్ కార్తీక మాసం పురస్కరించుకుని ఈ ప్రత్యేక సౌలభ్యం కల్పించినట్లు ప్రకటన ప్రసారం చేసింది. కార్తీక మాసం నెల రోజులపాటు ఈ సౌలభ్యం చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
ఈ చర్య విస్తృత విమర్శలకు దారి తీసింది. పవిత్ర శ్రీ జగన్నాథ మహా ప్రసాదం లభ్యతని ఇలా దిగజార్చడం భక్తుల పట్ల విశ్వాస ఘాతం. భక్తుల మనోభావాలను సొమ్ము చేసుకుని నిలువునా దోచుకునేందుకు వినూత్న ప్రయత్నంగా విమర్శలు వ్యాపించాయి. ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయ విలువల్ని దిగజార్చే ఇటువంటి చర్యల పట్ల అధికార యంత్రాంగం కఠినంగా స్పందించాలని భక్తజనం అభ్యర్థిస్తుంది. ఇలాంటి ప్రకటనలు ఆలయ ప్రసాదాల ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను దెబ్బతీస్తాయని సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతుంది. భగవంతుని ఆశీర్వాదంగా భావించే పవిత్రమైన అన్న ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే వస్తువుగా పరిగణించరాదని పలువురు మత పండితులు, ఆలయ నిర్వాహకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక సంప్రదాయాలను వ్యాపారాత్మకంగా మార్చడం ఎంత మాత్రం తగదని అభ్యర్థిస్తున్నారు. ఆన్‌లైన్ ఆహార డెలివరీ ఏజెంట్లు మాంసాహార ఆహార పదార్థాలతో కలిపి భగవంతుని అన్న ప్రసాదాల్ని డెలివరీ చేయడం ఆధ్యాత్మిక, ధార్మిక విలువల్ని నీరుగార్చడమే అవుతుందంటున్నారు. తక్షణమే ఈ దుశ్చర్యపై శ్రీ మందిరం పాలక మండలి స్పందించి ఆన్‌లైన్‌లో మహా ప్రసాదం విక్రయ ప్రకటనలకు కట్టడి చేయాలని కోరారు.

ఆన్‌లైన్‌లో అన్న ప్రసాదంపై వివాదం