
బొణై మాజీ ఎమ్మెల్యే మృతి
భువనేశ్వర్: సుందరగడ్ జిల్లా బొణై నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే హేమేంద్ర ప్రసాద్ మహాపాత్రో (92) ఖుటుగాంవ్‌లో బుధ వారం మరణించారు. అతడు 1961, 67, 71లో వరుసగా 3 సార్లు స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శాసన సభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈనెల 29న జాతీయ కార్యవర్గ సమావేశం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఈనెల 29వ తేదీన అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్టు రెండో జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ట్రస్టు సభ్యులు, గుణుపూర్ ధర్మశాస్త అయ్యప్ప మందిరం సభ్యులు జి.అనంతరావు గురుస్వామి ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయ్యప్ప స్వామి మందిర ప్రాంగణంలో జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీష్‌ఘడ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలిసారిగా శబరిమల సమీపంలోని పంబ, నీలక్కాల్ మధ్య ట్రస్టు తరుపున అయ్యప్ప భక్తులకు ఉచిత అన్నప్రసాద సేవనం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నవంబర్ నుంచి మకర జ్యోతి దర్శనం వరకు అక్కడకు వచ్చే భక్తులకు ఈ సౌకర్యం లభిస్తుందని తెలిపారు.