
రోడ్డు పనులు పూర్తి చేయండి
జయపురం: స్థానిక మహాత్మా గాంధీ రోడ్డు(ఎం.జి.రోడ్డు) పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జయపురం మునిసిపాలిటీ కౌన్సిలర్లు జయపురం రోడ్డు భవన విభాగ సూపరింటెండెంట్ ఇంజినీర్ ప్రియదర్శి బెహరాను మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. మునిసిపాలిటీ ఉపాధ్యక్షురాలు బి.సునీత నేతృత్వంలో బీజేడీ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. పట్టణంలో ప్రధాన మార్గంలో ఒకటైన ఎం.జి రోడ్డు పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది నవరంబర్ 14వ తేదీన అధికారుల నిర్ణయం మేరకు మునిసిపాలిటీ 40 అడుగుల రోడ్డు ఏర్పాటు కోసం రెండు వైపులా ఆక్రమణలను తొలగించటం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బీ విభాగం టెండర్ పిలిచి కంట్రాక్టర్‌కు పనులు ఇచ్చిందన్నారు. డ్రైన్ పనులు చేపట్టారని, ఇంతవరకు 90 శాతం డ్రైన్ పనులు పూర్తయ్యాయన్నారు. రోడ్డు పనులు నేటికీ చేపట్టలేదని, రోడ్డు మధ్యన ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించలేదన్నారు. డ్రైన్ పనులు పూర్తికాకపోవటం వలన రోడ్డుపైనే నీరు ప్రవహిస్తోందన్నారు.విద్యుత్ స్తంభాల నుంచి లైట్లు తీసివేయటం వలన వెల్‌కమ్ జంక్షన్ నుంచి కమళా మెడికల్ వరకు అంధకారంగా ఉందన్నారు. వెంటనే రోడ్డు పనులు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు బి.విష్ణువర్దన్ రెడ్డి, జస్‌పాల్ సింగ్, శశిరేఖ పొరజ, తదితరులు పాల్గొన్నారు.