
‘కిరణ్’తో అక్షర జ్ఞానం
జయపురం: ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యత ఎక్కువగా ఉంది. బడి మెట్లు ఎక్కని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. పశువులు కాయటం, అటవీ ఉత్పత్తులు సేకరణలో జీవితాలను గడుపటం పరిపాటి. అటువంటి పిల్లలకు అక్షర జ్ఞానం కల్పించేందుకు గోపబందు సేవా పరిషత్ అనే స్వచ్ఛంద సంస్థ నడుం బిగించింది. ఆదివాసీలలో నిరక్ష్యరాస్యతను రూపుమాపేందుకు ఆ సంస్థ ఉద్యమిస్తోంది. జిల్లాలో అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో గోపబందు సేవా పరిషత్ ‘కిరణ్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఆ సంస్థ కార్యకర్తలు మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు, డ్రాపౌట్ విద్యార్థులకు చదువు చెబుతున్నారు. ఆ సమితిలో డుమునిజోల, గొయల్‌జొడి, చిలిమల, పొటైపొదర్, సిలిమాల గ్రామాల్లోని 15 ఏళ్ల లోపు పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమం చేపట్టారు. ఇంతవరకు 120 మంది పిల్లలకు చదువు చెబుతున్నామని గోపబందు సేవా పరిషత్ సభ్యులు తెలిపారు. కోటపొడ పంచాయతీ డుమునిజొల, చంచల ఖొర, ఉరదబ ఖొర, గొయల్‌జొడి, దొయితారి ఖిలో గ్రామాల్లో చదువు కునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గోపబందు సేవా పరిషత్ అధ్యక్షుడు ప్రదీప్ మహరణ మాట్లాడుతూ ఆదివాసీ మారుమూల గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన లేదని, పిల్లల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హాస్టల్ సౌకర్యం గురించి వారికి తెలియదన్నారు. మారుమూల దుర్గమ ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవటం వలన చిన్న పిల్లలు చదువుకునే అవకాశాలు లేవని, అందువల్ల కిరణ్ పాఠశాల ద్వారా అటువంటివారికి ఉత్తమ భవిష్యత్‌ను కల్పించేందుకు తాము నడుంబిగించామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గుంజీ అనుస్థాన్, దీపబందు ఫౌండేషన్‌లు సహకరిస్తున్నాయన్నారు. పిల్లలకు ఉచిత విద్యాభోదనతోపాటు పాఠ్య పుస్తకాలు, అవసరమైన పరికరాలు సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. విద్యాధికారానికి దూరం అయిన పిల్లలకు విద్యాధికారం కల్పిస్తున్న గోపబందు సేవా పరిషత్ వారి కిరణ్ కార్యక్రమం ప్రశంసనీయమని జిల్లా పరిషత్ సభ్యులు రాజేష్ మహురియ అన్నారు.