
మూఢ నమ్మకాలతో అరాచకాలు సృష్టిస్తే చర్యలు
కొరాపుట్: మూఢ నమ్మకాలతో సమాజంలో సాటి వ్యక్తులను హింసిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాడువా పోలీసులు ప్రకటించారు. మంగళవారం కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో పంతుంగ్ గ్రామ పంచాయతీ మారిపుట్ గ్రామ ప్రజలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ గ్రామంలో లక్ష్మణ్ కిలో కుటుంబం చేతబడి చేస్తుందనే నెపంతో అతని సోదరుని కుమారులు దాడులు చేశారు. లక్ష్మణ్ ఇంటిపై దాడి చేసి పెంపుడు జంతువులైన కుక్కలు, మేకలు, కోళ్లును హింసించి చంపారు. ఆ ఇంట్లో ఉన్న పసి పిల్లలతో సహా 14 మందిని కొట్టి గ్రామం నుంచి వెలివేశారు. బాధితులు సమీప గ్రామంలో తల దాచుకున్నారు. ఈ ఘటనపై ఐఐసీ ఆశోక్ బిశోయి గ్రామస్తులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇటువంటి ఘటనలను చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇతర శాఖల సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. అనంతరం బాధిత కుటుంబానికి గట్టి భద్రత మీద తిరిగి వారి స్వగృహాలకు తెచ్చి వదలిపెట్టారు. గ్రామస్తులతో భవిష్యత్‌లో ఇటువంటి పనులకు పాల్పడబోమని ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గ్రామ ప్రజలకు అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

మూఢ నమ్మకాలతో అరాచకాలు సృష్టిస్తే చర్యలు