
విద్యుత్ సమస్యలపై గిరిజనుల ఆందోళన
కొరాపుట్: విద్యుత్ సమస్యలపై గిరిజనులు ఆందో ళనకు దిగారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కేంద్రంలో సోమవారం ఆందోళన చేపట్టి సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమితి పరిధిలోని సుంకి, పెట్టురు, అంపావల్లి, గొల్లురు, పొట్టంగి పరిసర గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. లోఓల్టేజీ సమస్య, విద్యుత్ కోత, నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడం, వినియోగంతో సంబంధం లేకుండా బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ ఆందోళన చేపట్టారు. పెట్టురు వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్‌శాఖ కార్యాలయం సిబ్బందికి అందజేశారు. ఈ సమస్యలపై 15 రోజుల్లో పరిష్కార చర్యలు ఉంటాయని విద్యుత్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుతిరిగారు.