
నువాపడాలో 56 కొత్త పోలింగ్ కేంద్రాలు
భువనేశ్వర్: నువాపడా ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) అఖిల పక్షాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల దృష్ట్యా చేపట్టిన పలు సంస్కరణలు, సవరణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రతినిధులకు వివరించారు. త్వరలో నువాపడాలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం కింద 56 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను 302 నుంచి 358కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 36 పోలింగ్ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 322 ఉన్నట్లు పేర్కొన్నారు. నువాపడా నియోజకవర్గంలో 52 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్చినట్లు ప్రకటించారు. ఈ నెల 15న అర్హత తేదీగా పరిగణించి బ్యాలెట్ పత్రాల జాబితాను సిద్ధం చేశారు. రాజకీయ పార్టీలకు బ్యాలెట్ పత్రాల జాబితాను అందుబాటులో ఉంచారు. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు.