
అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ సన్నద్ధత
భువనేశ్వర్: శాసన సభలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు కాంగ్రెసు సన్నద్ధత వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ శాసన సభ నాయకుడు రామచంద్ర కదమ్ ఈ విషయం వెల్లడించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్‌కు సభలో 51 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వారి సహకారం తీసుకుంటామన్నారు. బీజేడీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కాంగ్రెస్ సహకారం అందిస్తుందని, లేకుంటే కాంగ్రెసు స్వతంత్రంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలి గందరగోళ పరిస్థితి తాండవిస్తుంది. ప్రజలు సురక్షితంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లింగరాజ ఆలయంలో
భక్తుడికి గాయాలు
భువనేశ్వర్: స్థానిక ఏకామ్ర క్షేత్రం లింగరాజ ఆలయంలో సోమవారం అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. మహా ప్రభువు దర్శనం కోసం విచ్చేసిన యాత్రికుడు గాయపడ్డాడు. ఆలయ సముదాయం అడప మండపం నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని చికిత్స కోసం స్థానిక క్యాపిటల్ ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడిన భక్తుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివవర్ధన్ సింగ్‌గా గుర్తించారు. ఆయన గతంలో అనారోగ్యంతో ఉండి తల తిరగడం వల్ల పడిపోయినట్లు తోటి యాత్రికుల నుంచి తెలిసింది.
యువతే అభివృద్ధి రథ సారధులు
భువనేశ్వర్: యువతరం శక్తి, సామర్థ్యం, ఉత్సాహం రాష్ట్రాభివృద్ధికి బలమైన సారథ్యం వహిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. యువత శక్తిసామర్థ్యాల్ని సమాజ సంక్షేమానికి ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల సృష్టికి పెద్ద పీట వేసిందన్నారు. స్థానిక ఇడ్కో ప్రదర్శన మైదానంలో నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా 7 విభాగాలకు కొత్తగా ఎంపికై న 1,686 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. కృషి మరియు దృఢ సంకల్పంతో పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారందరికి ముఖ్యమంత్రి అభినందించారు.