
రానున్న దశాబ్దం నిత్యహరితం కావాలి: గవర్నర్
● ఓఎస్‌పీసీబీ 42వ వ్యవస్థాపక దినోత్సవం
భువనేశ్వర్: రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కాలుష్య నివారణ కోసం సంప్రదాయ ఇంధన వాహనాలకు స్వస్తి పలికి విద్యుత్ వాహనాలను (ఈవీలు) పౌరులు స్వీకరించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. స్థానిక ఒడిశా రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (ఓఎస్‌పీసీబీ) 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉద్దేశించి సోమవారం గవర్నర్ ప్రసంగిస్తూ పర్యావరణ పరిరక్షణ, పౌరులకు ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను నిర్ధారించడానికి సమష్టి చర్య అవసరాన్ని తెలియజేశారు. రాజ్ భవన్ అధీనంలో అధికారిక వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చి ఇతరులు అనుసరించడానికి ఒక ఉదాహరణగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులను తగ్గించడంతో స్వచ్ఛమైన విద్యుచ్ఛక్తి పొందేందుకు ప్రభుత్వ సబ్సిడీతో ప్రజలు డాబాపై సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని గవర్నర్ ప్రోత్సహించారు.
ఓఎస్‌పీసీబీ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ, వేగవంతమైన పారిశ్రామికీకరణను పర్యావరణ బాధ్యతతో సమతుల్యం చేయడంలో నియంత్రణ, మార్గదర్శకం మరియు భాగస్వామిగా బహుముఖ పాత్రధారిగా వ్యవహరించినందుకు డాక్టర్ కంభంపాటి బోర్డును ప్రశంసించారు. నేటి వ్యవస్థాపక దినోత్సవం ఒడిశా పర్యావరణాన్ని పరిరక్షించడంలో బోర్డు సమగ్ర, ప్రగతిశీల విధానాన్ని జరుపుకునే వేడుకగా పేర్కొన్నారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీగా 75 లక్షల మొక్కల పెంపకం కార్యక్రమంలో పౌరులు మరియు విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. గ్రీన్ టెక్నాలజీ, జీరో వేస్ట్ పరిశ్రమలు, యువత భాగస్వామ్యం, పర్యావరణ పర్యవేక్షణ కోసం డిజిటల్ సాధనాల ప్రోత్సాహంతో సహా సాహసోపేతమైన లక్ష్యాలతో రానున్న దశాబ్దాన్ని నిత్యహరితంగా ఆవిష్కరించే దృఢ సంకల్పంతో ఈ సంస్థ కృషి చేయాలని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ అహుజా, కాలుష్యాన్ని నియంత్రించడం, స్థిరమైన అభివృద్ధిని సాధించడం సమష్టి బాధ్యత అని నొక్కి చెప్పారు. అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత సాహు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) మరియు ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ సురేష్ పంత్, పీసీసీఎఫ్ ప్రేమ్ కుమార్ ఝా వంటి సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ బోర్డు వెబ్‌సైట్, ప్రచురణలను ఆవిష్కరించారు. సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహూను సత్కరించారు. కాలుష్య నియంత్రణ ఎక్సలెన్స్, ప్రశంస అవార్డులను ప్రదానం చేశారు. ప్రకృతి పరిరక్షణలో మరియు గ్రీన్‌ప్రెన్యూర్‌లుగా సాధించిన విజయాలకు మహిళలను సత్కరించారు.

రానున్న దశాబ్దం నిత్యహరితం కావాలి: గవర్నర్