
ఆందోళన తీవ్రతరం చేస్తాం
జయపురం: సేవా పేపరుమిల్లు విశ్రాంత శ్రామికుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి యాజమాన్యాన్ని హెచ్చరించారు. సోమవారం స్థానిక యాదవ భవనంలో సేవా పేపరుమిల్లు విశ్రాంత శ్రామికుల అత్యవసర సమావేశం జరిగింది. కార్మిక నేత బసంత బెహరా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సేవా కార్మిక సంఘ నేత ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ.. సేవా యూనిట్ హెడ్ ఎస్.ఎస్.పాల్ రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. మిల్లు నిర్వహణ బాధ్యత కొత్త మార్క్ ఏబీ కంపెని మేనేజ్‌మెంట్ డైరెక్టర్ అతుల్ డాభే చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకొని ఇతర విషయాలు చర్చించి ఒక కొలిక్కి వచ్చేసరికి ఈ నెల 25వ తేదీ కావచ్చని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 19 మంది శ్రామికుల గ్రాట్యుటీ ఫైనల్ చేయాలని, ఓపీడీఆర్ కేసు నోటీసు కంపెనీకి జారీ చేశారని మహంతి వెల్లడించారు. కార్మికులకు గత 14 నెలల జీతాలు చెల్లించలేదని, మృతి చెందిన శ్రామికుల కుటుంబాలకు, విశ్రాంత శ్రామికులకు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కొత్త యాజమాన్యం సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే అన్ని వర్గాల కార్మికులు సమైఖ్యంగా పోరాటం సాగించనున్నట్లు మహంతి హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక నేతలు నారాయణదాస్, మోహణ్ చరణ రౌత్, ధృభ మల్లిక్, రత్నాకర బెహరా తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన తీవ్రతరం చేస్తాం