
పేదలకు నిత్యావసరాల పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధులకు నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, ఉప్పు, నూనె తదితర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతీ నెల నిరుపేదలకు తమ సంస్థ ద్వారా నిత్యావసరాలను పంపణీ చేస్తున్నట్లు నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. అదేవిధంగా అనాథ ఆదివాసీ విద్యార్థులకు ట్రస్టు ద్వారా ఉచితంగా చదివించడంతో పాటు ఆశ్రమంలో భోజన వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు.
పిడుగు పడి వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి చాలాన్‌గూడ పంచాయతీ తాళపోదర్ గ్రామంలో శుక్రవారం పిడుగు పడి గ్రామానికి చెందిన ఉంగ కార్తమి(46) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. తాళపోదర్ గ్రామానికి చెందిన ఉంగ కార్తమి తన భార్య, కుమారుడితో కలిసి శుక్రవారం ఉదయం తమ పొలంలో కలుపు మొక్కలు తీయడం కోసం వెళ్లారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో గాలివాన వచ్చింది. ఆ సమయంలో పిడుగు పడడంతో ఉంగ కార్తమి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలియడంతో మల్కన్‌గిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
టీకా వేయడంతో చిన్నారి మృతి..?
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి తుమ్కిమాడకా గ్రామంలో శుక్రవారం టీకా వేసిన కొన్ని గంటల్లో 4 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. దేవ మడ్కమి నాలుగు నెలల కుమార్తెకు గత రెండు రోజులుగా జ్వరం ఉంది. అయితే ఈ విషయం ఆరోగ్య సిబ్బందికి చెప్పినా సరే ఏమీ కాదని అంటూ చిన్నారికి టీకా వేశారు. అయితే టీకా వలనే తన బిడ్డ మృతి చెందిందని తండ్రి ఆరోపిస్తున్నారు. కాగా ఈ విషయాన్ని కలిమెల ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి దినబంధు మహానంద ఖండించారు. టీకా వలన ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. జ్వరం ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ముందునుంచి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
పోక్సో కేసులో ఆర్‌ఐకు
20 ఏళ్ల జైలు
పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరిలో 2020 జనవరి 25న ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శతృశల్యకు శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.పదివేల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా జడ్జి తీర్పునిచ్చారు. ఈ కేసును 2020లో అప్పటి ఆర్.ఉదయగిరి పోలీసు ఇన్‌స్పెక్టర్ మమతా నాయక్ పోక్సో చట్టం కింద రిజిస్టర్ చేశారు. ఈ కేసును పర్లాకిమిడి ఏడీజే కోర్టులో స్పెషల్ పీపీ ఆర్.జనార్ధనరావు ప్రాసిక్యూట్ చేశారు. అలాగే శిక్షపడిన ఆర్‌ఐ జిల్లా న్యాయసేవా ప్రాధికరణకు నష్టపరిహారం కింద రూ.4 లక్షలు చెల్లించాలని కూడా జడ్జి తీర్పు నిచ్చారు.
పిడుగుపాటుతో ముగ్గురు మృతి
రాయగడ: పిడుగు పాటుతో ముగ్గురు మృతి చెందగా మరొకరు గాయాలకు గురైన సంఘటన శుక్రవారం సాయంత్రం బిష్ణుగుడ గ్రామంలో చోటు చేసుకుంది. ముగ్గురు పనిచేసుకుంటూ ఉండగా పిడుగు పడంది. బిష్ణుగుడ గ్రామానికి చెందిన సంబారి పిడిక (32) మృతి చెందిన వారిలో ఉండగా మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మరొకరు గాయాలతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

పేదలకు నిత్యావసరాల పంపిణీ

పేదలకు నిత్యావసరాల పంపిణీ

పేదలకు నిత్యావసరాల పంపిణీ