
ఎరువుల సంక్షోభంపై 17న బీజేడీ ధర్నా
భువనేశ్వర్: రాష్ట్రంలో ఎరువుల కొరతపై తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో విపక్ష బిజూ జనతా దళ్ ఈ నెల 17న రాజ్ భవన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనుంది. స్థానిక శంఖ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేడీ ఉపాధ్యక్షుడు సంజయ్ దాస్ బర్మా చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ మాట్లాడారు. ఎరువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని ప్రభుత్వం పదే పదే చేస్తున్న వాదనను తోసిపుచ్చారు. సరఫరాల శాఖ నుంచి అధికారికంగా అందిన సమాచారం ప్రకారం తమ వాదనను తెరపైకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉందన్నారు. అవసరాలు, సరఫరా మధ్య భారీ అంతరాలు అధికారిక సమాచారంలో వెల్లడైనట్లు వివరించారు.
గంజాం జిల్లాలో 19,561 మెట్రిక్ టన్నుల ఎరువుల కోసం రైతులు ఆరాటపడుతుండగా మొక్కుబడిగా 10,640 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశారు. భద్రక్ జిల్లాలో రైతాంగం ఎరువుల కొరతతో అల్లాడుతున్నారు. సాగు పనుల కోసం 6,188 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా కోసం అభ్యర్థించగా 863 మెట్రిక్ టన్నులు సరఫరా చేసి అసంతృప్తకి గురి చేసినట్లు బీజేడీ ఆరోపించింది. బాలాసోర్ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 2,600 మెట్రిక్ టన్నుల ఎరువులు ఆశిస్తున్న రైతులకు నామ మాత్రంగా 900 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. అంగుల్ జిల్లా రైతాంగం రైతాంగం 8,100 మెట్రిక్ టన్నులు కోరగా 4,954 మెట్రిక్ టన్నులు అందజేశారు. ఈ తరహా కొరతను నిరసిస్తూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తున్నారని బిజూ జనతా దళ్ నాయకులు వెల్లడించారు. అయితే ప్రభుత్వం ‘సంక్షోభం లేదు’ అని చాటుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. 36 నెలల్లోపు తాల్చేర్ ఎరువుల కర్మాగారం పనిచేయిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకుండా కాలక్షేప ధోరణి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇదే తరహాలో కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా మండలం స్థాయి ఆందోళనలు చేపడతామని విపక్ష బిజూ జనతా దళ్ హెచ్చరించింది.