
దండు మారెమ్మ గుడిలో దసరా ఉత్సవాలు
పర్లాకిమిడి: పట్టణంలో డోలా ట్యాంకు రోడ్డు దండుమాలవీధిలో ఉన్న దండు మారెమ్మ అమ్మవారి తలుపులు శుక్రవారం తెరుచుకున్నాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే అదీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పదిహేనురోజుల ముందు తెరుచుకునే ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం వెనుక పెద్ద పాముపుట్ట ఉంటుంది. దసరా శరన్నవరాత్రులు ముగిసిన పిమ్మట విజయదశమి నిశిరాత్రి అమ్మవారికి కొబ్బరికాయ, పండ్లు నైవేద్యం పెట్టి అఖండ దీపం వెలిగించి తలుపులు మూసి వేస్తారు. తిరిగి తర్వాతి సంవత్సరం విజయదశమి ముందు గుడి తలుపులు తెరుస్తారు. అమ్మవారి వద్ద ఉన్న దీపం వెలుగుతూనే వుండటం విశేషం. అలాగే అమ్మవారి దగ్గర ఉంచి కొబ్బరి కాయ హోమంలో కాల్చి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడతారు. శరన్నవరాత్రుల కోసం దండు మారెమ్మ మందిరానికి రంగులు వేసి చుట్టు పక్కలా అమ్మవారు, విఘ్నేశ్వరుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో అన్న ప్రసాదాలకు ప్రత్యేక షెడ్డును నిర్మించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిళాయి, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి దండు మారెమ్మ ఉత్సవాలు చూడటానికి వస్తుంటారు. అనేక మంది భక్తులు ఇటీవల ఈ మందిరానికి ఇతోధికంగా విరాళాలు ఇవ్వడంతో దండుమారెమ్మ ముఖద్వారం నిర్మించారు. ఈ ఏడాది ఎప్పటిలాగే దండుమారెమ్మ ఉత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.

దండు మారెమ్మ గుడిలో దసరా ఉత్సవాలు

దండు మారెమ్మ గుడిలో దసరా ఉత్సవాలు