
ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి..
జయపురం: ఆ వృద్ధుడి వయసు 80 ఏళ్లు. 72 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూలి పనుల కోసం వలస వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడా ఆచూకీ కూడా లేకపోవడంతో ఆయన చనిపోయాడనే కుటుంబ సభ్యులంతా భావించారు. కానీ ఎనిమిదేళ్ల తర్వాత అతడు గురువారం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌కు చెందిన రెండు స్వచ్ఛంద సంస్థల సాయంతో ఆ వృద్ధుడు క్షేమంగా ఇంటికి చేరాడు. జయపురం సబ్‌డివిజన్ కుంధ్రా సమితి కెరమిటి గ్రామ పంచాయితీ కెంధుగుడ గ్రామం అగాదు శాంత(80) ఎనిమిదేళ్ల కిందట ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంతగానో గాలించారు. తమ ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారందరినీ ఆరా తీశారు. కానీ అగాదు జాడ తెలియరాలేదు. అయితే ఆగస్టు 12వ తేదీన రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు స్వచ్ఛంద సేవకుల నుంచి అశ్వినీ కుమార్ సింగ్, ఆటోడ్రైవర్ బాసు భాయ్‌లకు ఫోను వచ్చింది. ఒక నిస్సహాయ వృద్ధుడు అగాదు శాంత రాజస్థాన్ రాష్ట్ర జయపూర్ జిల్లా చిత్రకూట్ పోలీసు స్టేషన్ పరిధి పురాణిచుంగ్‌లో ఉన్నాడని చెప్పారు. వారు అక్కడకు చేరుకుని అగాదుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆగస్టు 20న రాజస్థాన్‌లో పురాణచుంగికి వెళ్లారు. అయితే వీరు వెళ్లేటప్పటికి అగాదు వేరే చోటకు వెళ్లిపోయారు. అక్కడ కుండపోత వర్షాలు కురుస్తుండడంతో నిరాశ చెంది వచ్చేశారు. ఈ విషయం కుంధ్ర గ్రామంలో బీజేపీ నేత సుమిత్ సాహుకు తెలుపగా అతడు ఈ నెల 6వ తేదీన అగాదు కుటుంబ సభ్యులను పట్టుకుని రాజస్థాన్‌లోని పురాణచుంగి గ్రామానికి వెళ్లారు. అక్కడ స్వచ్ఛంద కార్యకర్తలు అశ్వినీ కుమార్ సింగ్, డ్రైవర్ బాసు భాయిలను కలిశారు. అగాది శాంత ఆచూకీ కనుగొని గురువారం గ్రామానికి తీసుకువచ్చారు. అగాదు శాంతను తమ ఇంటికి చేర్చేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలిసిన కొట్‌పాడ్ ఎమ్మెల్యే ప్రతినిధి బద్రి నారాయణ ఆచార్య, బీజేపీ నేత ప్రకాశ్ పట్నాయిక్, తుషార్ భట్, బేణూధర పాత్రో, టిలోచన గౌఢ్ లు కెందుగుడ వెళ్లి అగాది శాంతను పరామర్శించారు.

ఎనిమిదేళ్ల తర్వాత ఇంటికి..