
బీజేడీ నుంచి మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్
భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా కామాఖ్యనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ల కుమార్ మల్లిక్‌ను బిజూ జనతా దళ్ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణ. ఢెంకనాల్ జిల్లా కామాఖ్యనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రఫుల్ల కుమార్ మల్లిక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు బిజూ జనతా దళ్ నుంచి తక్షణమే సస్పెండ్ చేశామని బిజూ జనతా దళ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయ ఉపాధ్యక్షుడు ప్రతాప్ జెనా శుక్ర వారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ జెనా మాట్లాడుతూ ప్రఫుల్ల కుమార్ మల్లిక్‌ను ఈ శతాబ్దంలో అత్యంత అవకాశవాద నాయకుడు అని తీవ్రంగా విమర్శించారు. ప్రఫుల్ల కుమార్ మల్లిక్ బిజూ జనతా దళ్ టికెట్‌పై 4 సార్లు ఎన్నికయ్యారు. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ స్వయంగా ఆయన తరఫున ప్రచారం చేశారని జెనా అన్నారు. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కిందని, పనులు, గనులు వంటి కీలక శాఖలు అప్పగించారని అన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత, తన రాజకీయ జీవితాన్ని పోషించిన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడని, ఇది అతని అవకాశవాదాన్ని స్పష్టంగా బయటపెడుతుందని ప్రతాప్ జెనా వ్యాఖ్యానించారు.