
వెళ్లిపోతే ఏంటి?
నెక్కంటి..
● ఆయన రాజీనామాతో పార్టీకి ఒరిగిందేమీ లేదు ● పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహానికి పాల్పడ్డారు ● మాజీ మంత్రి, బీజేడీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావుతో పాటు అతని మద్దతుదారులు బీజేడీ పార్టీకి రాజీనామాలు చేసినంత మాత్రాన ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మాజీ మంత్రి, బిజూ జనతా దళ్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథ సరక స్పష్టం చేశారు. స్థానిక కై లాస్ హోటల్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 ఏళ్ల బీజేడీ హయాంలో నెక్కంటి ఎన్నో పదవులను అధిరోహించి ఉన్నత స్థాయికి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అయితే ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నమ్మక ద్రోహం చేసింది నెక్కంటే గానీ బీజేడీలో ఉన్న అదృశ్య శక్తి ఏమాత్రం కాదన్నారు. ముసలి కన్నీరు కార్చి పార్టీపై నిందలు మోపినంత మాత్రాన ఎవ్వరూ నమ్మరని చెప్పారు. ఆదివాసీ హరిజన జిల్లాగా గుర్తింపు పొందిన రాయగడలో జిల్లా అధ్యక్ష పదవిని ఈసారి తనకు దక్కడం నెక్కంటి జీర్ణించుకోలేకపొతున్నారని అన్నారు. ఒక ఆదివాసీ నాయకుడికి పదవి వచ్చిందని సంతోషించాల్సింది పోయి పార్టీపై దుమ్మెత్తి పోయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆయన పార్టీలో లేకపొవడం ఎంతొ శుభపరిణామమని అన్నారు. నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమవుతున్నానని చెప్పుకుంటున్న నెక్కంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు.
మరింత శక్తివంతంగా పార్టీ..
బీజేడీ త్వరలో మరింత శక్తివంతమైన పార్టీగా ఆవిర్భవించి తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేలా తాను శాయశక్తులా కృషి చేస్తానని సరక తెలిపారు. కలుషిత , కుతంత్ర రాజకీయాలకు తావులేకుండా నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలే పార్టీ విజయానికి సోపానాలుగా మారాయని, అంతేతప్ప నెక్కంటి వల్ల పార్టీకి గత ఐదేళ్లలో కీడే జరిగింది తప్పా ఏమాత్రం మంచి జరగలేదనడానికి గత సాధారణ ఎన్నికలే నిదర్శనమన్నారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో నెక్కంటి జిల్లాలోని మూడు శాసన సభ నియోజకవర్గాలతో పాటు కొరాపుట్ లోక్‌సభ స్థానాన్ని గెలిపించలేకపొయారని, అందుకు ఆయన స్వయంకృత అపరాధంతో పాటు కుటిల రాజకీయాలే ప్రధాన కారణమని దుయ్యబట్టారు. 50 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీ పరంగా అనేక ప్రయోజనాలు పొంది లాభపడ్డారే తప్పా అతను నష్టపోయిందేమీ లేదని విమర్శించారు.
వెన్నుపోటు రాజకీయాలు తగవు..
స్వచ్ఛమైన రాజకీయాలతో మాత్రమే పార్టీ మనుగడ కొనసాగుతుంది తప్ప కుఠిల రాజకీయాలతో ఏమాత్రం ముందుకు సాగలేదని పార్టీ సీనియర్ నాయకుడు, బీజేడీ జిల్లా మాజీ అధ్యక్షుడు సుధీర్ దాస్ అన్నారు. పార్టీలో లాభపడిన భాస్కరరావు రాజీనామా డ్రామా చేయడం పార్టీకి వెన్నుపోటులాంటిదన్నారు. అతని రాజీనామతో కార్యకర్తల్లో కొత్త ఆనందం వెలుగు చూస్తోందన్నారు. పార్టీకి రాజీనామ చేసిన అతని బిజు స్వాభిమాన్ మంచ్ అనే సామాజిక వేదికగా కార్యకలాపాలు కొనసాగిస్తామని బహిరంగంగా ప్రకటించారని, నవీన్ తండ్రి బిజూ పేరును ఎందుకు వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. బిజూ పేరుతొ మళ్లీ రాజకీయాల్లో చెలామణి అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతమవ్వదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, రాయగడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్రా పండా, జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు, సీనియర్ నాయకుడు పట్నాన గౌరీ శంకరరావు, గుణుపూర్ మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గొమాంగో, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వెళ్లిపోతే ఏంటి?