
ఎరువులు ఇవ్వండి మహాప్రభో!
ఆధార్ కార్డులతో బారులు తీరిన రైతులు
300 బస్తాల ఎరువులకు 800 మంది రైతులు
భువనేశ్వర్: ఎరువుల కొరతతో రాష్ట్ర రైతాంగం తల్లడిల్లుతోంది. అందుబాటులో ఉన్న అరకొర ఎరువుల కోసం అన్నదాతలు బారులు తీరుతున్నారు. పశ్చిమ ఒడిశా బొలంగీర్ జిల్లా దేవగడ్ ప్రాంతంలో రైతులు బుధవారం యూరియా అందజేయాలని కోరుతూ జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన చేపట్టారు. రోడ్డు పొడవునా ఆధార్ కార్డులు పేర్చి పంచాయతీ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో బారులు తీరారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వరుసలో గుమిగూడారు. బుధవారం ఉదయం బొలంగీర్ జిల్లా దేవగడ్ మండలం గౌడొగొఠొ వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రుణం తీసుకున్న రైతులకు ముందుగా యూరియా ఎరువులు అందించాలని నిబంధన విధించినందున, రుణం తీసుకోని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, రైతుల అవసరానికి అనుగుణంగా ఎరువులు అందుబాటులో లేవని అనుబంధ అధికార వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.