
గజపతి మహారాజు విగ్రహం ఏర్పాటుచేయాలి
రాయగడ: పర్లాకిమిడి మహారాజ కృష్ణ చంద్ర గజపతి నిలువెత్తు విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేయాలని ఉత్కళ సమ్మేళిని రాయగడ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు శాఖ సభ్యులు రాయగడ మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. స్వతంత్ర ఒడిశా ఆవిర్భావానికి గజపతి మహారాజు చేసిన సేవలు వివరించారు. గజపతి కూడలిలో పాత విగ్రహాన్ని తొలగించి దాని స్థానంలో సరికొత్త నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన అధికారి త్వరలో జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విషయాన్ని ప్రస్తావించి అందరి ఆమోదంతో ఆచరణ రూపం దాల్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఉత్కళ సమ్మేళిని రాయగడ శాఖ అధ్యక్షులు బ్రజసుందర్ నాయక్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు,పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.