
కొఠియాలో డిప్యూటీ సీఎం పర్యటన
కొరాపుట్: ఆంధ్ర–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొఠియాలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా పర్యటించారు. శుక్రవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొఠియా పంచాయతీ ఇంత వరకు 1,800 మంది మహిళలకు సుభద్ర యోజన కింద రు.5000 చొప్పున రెండు సార్లు అందించామని చెప్పారు. మరో 240 మందికి సాంకేతిక కారణాల వల్ల అందలేదన్నారు. వారికి కూడా శనివారం విడుదలయ్యే మూడో విడత సుభద్ర నిధులు అందుతాయన్నారు. వీరికీ మొత్తం 3 వాయిదాలు కలిపి రూ.1,500 చొప్పున అందుతుందన్నారు. మొత్తం కొఠియా పంచాయతీలో 24 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పర్యవేక్షణ జరుగుతుందన్నారు. శనివారం రు.5000 కోట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేస్తారన్నారు. ఈ నిధులు 3వ విడత సుభద్ర పథకం క్రింద జయపూర్ కేంద్రంగా విడుదల అవుతాయని చెప్పారు. అంతకుముందు కుందిలి సంతలో కూరగాయలు విక్రయిస్తున్న గిరిజన మహిళలతో సంభాషించారు. సిమిలిగుడ కళాశాల 40వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. సునాబెడాలో పెద్ద ఎత్తున్న మహిళలను డీసీఎంకు స్వాగతం పలికారు. ఉదయం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి జయపూర్ వచ్చారు. రాష్ట్ర మంత్రులు నిత్యానంద గోండో, ముఖేష్ మహాలింగ్‌లు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రఘురాం మచ్చో, రుపుదర్ బోత్ర తదితరులు పాల్గొన్నారు.

కొఠియాలో డిప్యూటీ సీఎం పర్యటన