
రాష్ట్ర శాసనసభ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ కొత్త వెబ్‌సైట్ – assembly.odisha.gov.inను స్పీకర్ సురమా పాఢి శుక్రవారం ప్రారంభించారు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర శాసన సభకు సంబంధించిన సమగ్ర సమాచారంతో దీనిని పునరుద్ధరించారు. కొత్త వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్, విభాగం కార్యదర్శి సత్యబ్రత రౌత్ పాల్గొన్నారు. రాష్ట్ర పౌరులకు శాసనసభ పనితీరును చేరువ చేయడంలో ఇది ఒక ముందడుగు అని రౌత్ పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా, శాసన సభ వ్యవహారాలు, కార్యకలాపాలు, చర్చలు, సభ్యుల వివరాలు, వివిధ నివేదికలకు సంబంధించిన సత్వర, కచ్చితమైన సమాచారాన్ని అందజేయడం ఈ వెబ్‌సైట్ లక్ష్యమని తెలిపారు. ఇది శాసన సభ సభ్యులకే కాకుండా పరిశోధకులు, విద్యార్థులు, మీడియా, సాధారణ ప్రజలకు కూడా విలువైన వనరుగా ఉపయోగపడుతుందని చెప్పారు.
నిత్యావసరాలు పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలో నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు నిత్యావసర వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. బియ్యం, కందిపప్పు, బంగాళదుంపలు, నూనె వంటి నిత్యావసర వస్తువులను ప్రతీ నెల నిరుపేదలకు ట్రస్టు తరఫున పంపిణీ చేస్తున్నామని నిర్వాహకురాలు ఎం.నళిని తెలిపారు. అలాగే ట్రస్టు ఆధ్వర్యంలో వంద మందికి పైగా ఆదివాసీ, అనాధ విద్యార్థులను చదివిస్తున్నట్టు పేర్కొన్నారు.
పట్టుబడిన పేకాటరాయుళ్లు
జయపురం: స్థానిక దాసర వీధిలో జరుగుతున్న పేకాట శిబిరంపై జయపురం పోలీసులు దాడి చేశారు. ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.10,500 స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఆర్.నాయిక్, ఎం.ఖొర, ఎస్.సొగొడియ, ఎం.ఎన్.కుమార్, బి.హంతాల్ ఉన్నారు.
యువకుడి
అనుమానాస్పద మృతి
భువనేశ్వర్: స్థానిక బారిముండొ ప్రాంతంలో యువకుడి అనుమానాస్పద మరణం కలకలం రేపుతోంది. మంచేశ్వర్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరుకుని ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహం స్వాధీనపరచుకుని శవ పరీక్షల కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు కన్హూ బారిక్‌గా గుర్తించారు. ఏడాదిన్నర క్రితం ధౌలి ప్రాంతంలో వివాహం చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు.
మహిళపై
డెలివరీ బాయ్ దాడి
భువనేశ్వర్: నగరంలో మహిళపై డెలివరీ బాయ్ దాడి చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక భరత్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ డెలివరీ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఈ వివాదానికి దారి తీసినట్లు ప్రాథమిక సమాచారం. డెలివరీ బాయ్ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది.
పోలీసుల కథనం ప్రకారం నిందితుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసిన ఆహారం అందించేందుకు వెళ్లిన సందర్భంగా మహిళతో సంభాషణ సమయంలో వివాదం చెలరేగింది. నిందితుడు ఆమెను పదునైన గిన్నెతో కొట్టడంతో తల, మెడ, చేయిపై బలమైన గాయాల య్యాయి. బాధితురాలు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. భరత్‌పూర్ ఠాణా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు.