
త్వరితగతిన ఆడిటోరియం పునర్నిర్మాణ పనులు
జయపురం: జయపురం పాత ఫైర్ స్టేడియం, గుర్రాల శాల మైదానంలోని ప్రతాప్ నారాయణ సింగ్ దేవ్ ఆడిటోరియం పునర్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జయపురం సబ్‌కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారిణి అక్కవరం శొశ్య రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆడిటోరియం పునఃనిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. అయితే పనులు నత్తనడకలా సాగుతున్నట్టు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 25 ఏళ్ల కిందట ఆఖరి జయపురం మహారాజు రామకృష్ణ దేవ్ సోదరులు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ప్రతాప్ నారాయణ సింగ్ దేవ్ పేరుతో స్టేడియం నిర్మించారు. అతి విలువైన కుర్చీలు ఇతర సామగ్రితో అందంగా తీర్చిదిద్దారు. కొంత కాలం బాగా నడిచిన ఆడిటోరియం అధికారుల నిర్లక్ష్యం కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. దీంతో స్టేడియాన్ని పునర్ నిర్మాణం చేసేందుకు రెండేళ్ల కిందట మున్సిపాలిటీ టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్‌కు పనుల అప్పగించారు. అయితే పూర్తికాకపోవడంతో సబ్ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తిచేయాలని కంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వెంటనే పూర్తి చేయించాలని మున్సిపల్ జూనియర్ ఇంజినీర్‌కు సూచించారు. పరిశీలనలో మున్సిపల్ సహాయ కార్యనిర్వాహక అధికారిణి పూజ రౌత్, ఇంజినీర్ చైతన్య బాసికే, మున్సిపల్ ఉద్యోగులు సత్యనారియణ పాత్రో, దేవ ప్రసాద్ మహంతి ఉన్నారు.

త్వరితగతిన ఆడిటోరియం పునర్నిర్మాణ పనులు