
రైల్వే స్టేషన్‌లో భారీ దోపిడీ
● రూ.20 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు తస్కరణ ● ఆర్పీఎఫ్ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
రాయగడ: సదరు సమితి జిమిడిపేట రైల్వే స్టేషన్‌లో భారీ దోపిడీ జరిగింది. రాయగడ నుంచి గుంటూరు వైపు వెళ్లున్న ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నగల వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, అతని వద్ద గల బంగారు నగల బ్యాగ్‌ను లాక్కోని పారిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన ఆర్.ముళ్ల అనే నగల వ్యాపారి రాయగడకు వచ్చారు. ఇక్కడ నగల వ్యాపారస్తులకు తాను తీసుకువచ్చిన నగలను విక్రయించడంతోపాటు ఆర్డర్ల ప్రకారం నగలను తయారీ చేసి తిరిగి ఇస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రాయగడకు వచ్చిన ముళ్ల ఇక్కడి నగల వ్యాపారస్తులను కలిసి లావాదేవీలను పూర్తి చేసుకుని తిరిగి గాజువాకకు వెళ్లేందుకు మధ్యాహ్నం రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ కంపార్ట్‌మెంట్ బి–2 బోగీలో ప్రయాణిస్తున్నాడు. ట్రైన్ జిమిడిపేట చేరేసరికి గుర్తుతెలియని ఐదుగురు దుండగులు అదే కంపార్ట్‌మెంటులోకి చొరబడి వ్యాపారిపై దాడి చేసి, నగల బ్యాగున్ లాక్కోని పారిపోయారని బాధితుడు రైల్వే పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాగులో సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని వివరించారు. దుండగులు తన వద్ద గల బ్యాగును లాక్కోని పారిపొతున్న సమయంలో తాను కూడా కొంతవరకు వెంబడించానని, వారు ఫ్‌లై ఓవర్ మీదుగా సమీప అడవుల్లోకి పారిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం రాయగడ జ్యూయలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కింతలి ఆమర్‌నాథ్, మరి కొందరు వ్యాపారస్తుల సహాయంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలియజేశాడు. దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు జిమిడిపేట రైల్వే స్టేషన్‌లో గల సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించారు.

రైల్వే స్టేషన్‌లో భారీ దోపిడీ