
ఆదిత్యుని ఆలయంలో నియామకాలు
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో సిబ్బంది కొరతకు చెక్ పడనుంది. ఇంతవరకు దినసరి వేతనదారుల రూపంలో పనిచేస్తున్న సిబ్బంది స్థానంలో కొత్తగా అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు ఈనెల 18న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కోసం టెండర్ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ ప్రకటించారు. ఆలయ పరిసరాల్లో గోశాల సిబ్బంది – 2, గార్డెన్, ఇంద్ర పుష్కరిణి నిర్వహణకు – 2, అన్నప్రసాద వితరణ సిబ్బంది – 13, లడ్డూ, పులిహోర ఇతర ప్రసాదాల తయారీ, ఉచిత ప్రసాద వితరణ సిబ్బంది – 12, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది – 7, మతపరమైన సిబ్బంది – 7, టెక్నికల్ సిబ్బంది – 3 తదితర 46 పోస్టులు కొత్తగా భర్తీ కానున్నాయి. ఈ మేరకు ఒక ఏడాదికి ఏజెన్సీ గుర్తింపునకు ఈనెల 18న సోమవారం ఉదయం 11 గంటలకు ఆలయ మండపంలో టెండర్ ప్రక్రియను నిర్వహించనున్నారు. దీంతో దినసరి వేతనదారులకు బదులు తొలిసారిగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆలయ సేవలో ఉండనున్నట్లు పేర్కొన్నారు.