పాలిథిన్‌ వాడకంపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

పాలిథిన్‌ వాడకంపై ఉక్కుపాదం

Aug 3 2025 2:55 AM | Updated on Aug 3 2025 2:55 AM

పాలిథ

పాలిథిన్‌ వాడకంపై ఉక్కుపాదం

రాయగడ: పాలిథిన్‌ క్రయవిక్రయాలపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పట్టణంలొ కొందరు వ్యాపారులు యథేచ్ఛగా విక్రయిస్తుండటంపై మున్సిపాలిటీ యంత్రాంగం స్పందించింది. శనివారం వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేపట్టింది. మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్‌ కుమార్‌ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడులో 10 కిలోల పాలిథిన్‌ బ్యాగులను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు.

కేంద్ర ఆస్పత్రిలో

ఐసీయూ సౌకర్యం

జయపురం: జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో త్వరలో ఐసీయూను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిసింది. ప్రమాద స్థితిలో ఉన్న రోగులు ఐసీయూ కోసం ప్రైవేట్‌ ఆస్పత్రి లేదా కొరాపుట్‌ సహిద్‌ లక్ష్మణ నాయిక్‌ వైద్య కళాశాల మెడికల్‌పై ఆధార పడుతున్నారు. జయపురంలో ఐసీయూ ప్రారంభిస్తే ఐసీయూ సౌకర్యం జయపురంలోనే కలుగుతుందని వెల్లడించారు.

గంజాయితో ముగ్గురు అరెస్టు

టెక్కలి రూరల్‌: ఒడిశా నుంచి అక్రమంగా 23.025 కేజీల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. గంజాయి రవాణాపై వచ్చిన ముందస్తు సమాచారం మేరకు టెక్కలి పోలీసులు రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చే మార్గంలో వాహన తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ తనిఖీల్లో ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా పద్మపూర్‌ పరిధి తెంబగూడ, మిల్కాపంగా గ్రామాలకు చెందిన రచనా లియా, ఆకాష్‌ ఘంటా, తారా కుమారి బర్ధాన్‌ అనే ముగ్గురు వ్యక్తులు మూడు బ్యాగుల్లో 23.025 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని వెల్లడించారు. ఈ గంజాయిని రాయఘడ జిల్లా సుందరిగూడకు చెందిన బిడికి రమేష్‌ అనే వ్యక్తి, మహారాష్ట్రలోని అకోలా జిల్లా హరిహరపేటకు చెందిన గోకుల్‌చంద్రాకు అప్పజెప్పేందుకు ఈ ముగ్గురినీ వినియోగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

మెళియాపుట్టి: కరెంట్‌ షాక్‌తో ప్రైవేట్‌ లైన్‌మెన్‌ మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం గొడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గొడ్డ గ్రామానికి చెందిన ప్రైవేట్‌ లైన్‌మెన్‌ కోరాడ షణ్ముఖరావు (67) గ్రామంలోని ఒక ఇంట్లో ఎర్త్‌ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ సరఫరా రావడంతో కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే గ్రామస్తులు మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం ఒక్కగానొక్క కుమారుడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది.

జవాన్‌ బలవన్మరణం

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డు శివాజీనగర్‌కు చెందిన బద్రి ఈశ్వరరావు (38) శనివారం బలవన్మరణం చెందాడు. జవాన్‌ (ఐటీబీపీ)గా పనిచేస్తున్న ఈయన సెలవుపై ఇంటికి వచ్చి ఉన్నారు. అయితే శనివారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ ఉన్నాడని, అందుకే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతుడుకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు.

ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

కొత్తూరు: మండలంలోని మెట్టూరు బిట్‌–2 ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన పెద్దకోట గోవిందరావు(49) శనివారం రాత్రి మండలంలోని నేరడి గ్రామానికి వెళ్లే దారిలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ ఎండీ అమీర్‌ ఆలీ తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు గోవిందరావు కుటుంబంతో పాటు 80 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి అతని అత్త పాపమ్మ నివాసం ఉంటోంది. అయితే అతడి అత్త పాపమ్మ తన ఆస్తి మొత్తం నష్టం చేశావని అల్లుడు గోవిందరావును అన్నది. దీంతో మనస్తాపం చెందన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయి చెట్టుకు ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అటువైపు వెళ్లిన ఒక వ్యక్తి చెట్టుకు వేలాడుతున్న గోవిందరావును చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. భార్య దశాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పాలిథిన్‌ వాడకంపై ఉక్కుపాదం 1
1/1

పాలిథిన్‌ వాడకంపై ఉక్కుపాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement