
ఇద్దరు కార్మికులు మృత్యువాత
కొరాపుట్: విష ప్రయోగం కారణంగా ఇద్దరు బీహార్ కార్మికులు మృతి చెందారు. నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని చకల్ పొదర్ గ్రామ పంచాయతీ భారకవతలో బీహర్ రాష్ట్రం సరస జిల్లాకు చెందిన పిరియా సదా (20), రాకేష్ సదా (18) జొరిగాంలో మెగా వాటర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూలి పనికోసం వచ్చారు. మంగళవారం వీరిద్దరూ ఆహారం తిని నిద్రపోయారు. రెండు గంటల తర్వాత ఒక్కసారిగా వాంతులు మొదలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు స్పందించి బాధితులను జోరిగాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గ మధ్యలో రాకేష్ మృతిచెందాడు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో షిరియా సదా మృతి చెందాడు. జోరిగాం పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.