
రాజ్యాంగ పరిరక్షణకే రాహుల్ పర్యటన
కొరాపుట్: రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాష్ట్రానికి రాహుల్ గాంధీ వస్తున్నారని కొరాపుట్ డీసీసీ కో ఆర్డినేటర్ శశి భూషణ్ బెహరా పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జయపూర్ మెయిన్ రోడ్డులోని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన భువనేశ్వర్‌లో రాజ్యాంగ పరిరక్షణ సభ జరుగుతుందన్నారు. ఈ సభకి రాహుల్‌తోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తదితరులు వస్తారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, పేదలకు అందని సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై ఈ సభలో నిరసన గళం వినిపిస్తామని శశి భూషణ్ బెహరా పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్ గంగ్ పూర్, ఎమ్మెల్యే పి.ఎస్.రాజన్ హిక్కా, చిత్ర కొండ ఎమ్మెల్యే మంగులు కిలో, జయపూర్ మున్సిపల్ చైర్మన్ నొరి మహంతి, నాయకుటు నిమయ్ సర్కార్, రుపక్ తురుక్, తదితరులు పాల్గొన్నారు.