
నందాహండిలో నిధుల స్వాహా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితిలో రూ.12 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష బీజేడి ఆరోపించింది. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని గ్లేజ్ హోటల్‌లో పార్టీ మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అతి చిన్న సమితి నందాహండిలో మూడేళ్లలో 127 ప్రాజెక్టులకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. పనులు జరగకుండానే జరిగినట్లు రికార్డుల్లో చూపించి నిధులు కై ంకర్యం చేశారని ఆరోపించారు. వాటర్ షెడ్, హార్టికల్చర్, అటవీ, సమితి విభాగంలో సమష్టి కుంభకోణం జరిగిందన్నారు. తక్షణమే విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేడీ నాయకులు అరుణ్ మిశ్రా, మంజులా మజ్జి, రబీ పట్నాయక్, సరోజ్ పాత్రో, ప్రమోద్ రథ్, నాగేంద్ర పట్నాయక్, ఉత్తం త్రిపాఠి, రాజేష్ త్రిపాఠి, సుమిత్ పూజారి, దయానిధి బిసోయి తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల నిరసన
కొరాపుట్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కొరాపుట్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ మినిసీ్త్రరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్రశాఖ పిలుపు మేరకు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీలోగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించక పోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానం రద్దు చేయాలని, రూ. 20 లక్షల బీమా ఇవ్వాలని, కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని, ఖాళీలు భర్తీ చేయాలని నినాదాలు చేశారు. జిల్లాలోని 14 సమితులు, నాలుగు మున్సిపాలిటీల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
యువకుడు బలవన్మరణం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి మునిఖోల్ గ్రామానికి చెందిన ధీరజ్ ఆచార్య (23) మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధీరజ్ ఆచార్య మునిఖోల్ గ్రామంలోనే తల్లితో కలిసి ఉంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఏం కష్టం వచ్చిందోగాని మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిపై కప్పుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటి తరువాత తన తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి ఽధీరజ్ శవమై వేలాడుతూ కనిపించడంతో కన్నీరుమున్నీరైంది. ఇరుగు పొరుగు వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆచార్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మునిగుడ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఐఐసీ సౌదామిని బెహర తెలిపారు.
సారాతో ఇద్దరి అరెస్టు
జయపురం: చట్ట వ్యతిరేకంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం అబ్కారీ అధికారి సుభ్రత్ కిశోర్ హిరన్ బుధవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి ఉమ్మిరి గ్రామానికి చెందిన కరణ కొటియ, డొంగాగుడ వాసి భీమా నాయిక్‌గా వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో నిందితులు కరణ, భీమాలు సారాను తరలిస్తుండగా పట్టుబడినట్టు పేర్కొన్నారు. వారిరువురుపై రెండు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు.

నందాహండిలో నిధుల స్వాహా

నందాహండిలో నిధుల స్వాహా