
రోడ్డు మరమ్మతులు చేపట్టలేదని నిరసన
జయపురం: రోడ్డు మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇబ్బందులుపడుతున్నామంటు జనం నిరసనకు దిగారు. జయపురం సబ్‌డివిజన్ బోయిపరిగుడ సమితి దొండాబడి పంచాయతీ నుండి పనసపుట్ గ్రామం మీదుగా జంగోలజోడి గ్రామం వరకు ఉన్న రోడ్డు పంట పొలంలా మారడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోడ్డుకు మరమ్మతులు లేదా పునఃనిర్మాణం చేయాలని ఆ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా సమితి, జిల్లా అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు వినూత్న రీతిలో బుధవారం నిరసనకు దిగారు. పంట పొలంలా ఉన్న రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేవారు. గ్రామస్తులు వివరణ ప్రకారం తమ గ్రామానికి రోడ్డు వేయాలని అధికారులకు విన్నవించుకోగా దొండాబడి నుంచి జంగొలజొడి గ్రామం వరకు 2019లో తారు రోడ్డు వేశారన్నారు. అయితే రోడ్డు నాణ్యత లేక పోవటంతో రెండు నెలలకే శిథిలమై గతుకులుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఈ విషయం సంబంధిత అధికారులకు తెలియజేసినప్పటికీ సమస్యను పరిష్కరించలేదని గ్రామ పెద్ద బిజయ ఖొర ఆరోపించారు. రోడ్డు బాగు చేయకపోవటంతో గ్రామానికి అంబులెన్స్ కూడా రావడం లేదని.. దీంతో అత్యవసర సమయంలో రోగులు, గర్భిణులు, మహిళలు వెళ్లిలేకపోతున్నారన్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లలేక పిల్లలు అవస్థలు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. ఇప్పటికై న రోడ్డు పనులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.