
ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం ఆకస్మిక పర్యటన
కొరాపుట్:
ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వరన్ ఫంకువాల్ ఆకస్మికంగా పర్యటించారు. కొత్త వలస–కిరండోల్ మార్గంలో కొరాపుట్–కిరండోల్ (కేకే 2) లో విండో ఎల్‌జి స్పెషల్ రైలులో ప్రయాణం చేశారు. ఈ మార్గంలో రైల్వే స్థిరీకరణ, రైల్వే స్టేషన్లు పరిశీలించారు. విండో ప్రయాణంలో ట్రాక్స్, మలుపులు, వంతెనలు, గుహల గుండా పర్యవేక్షించారు. ఇటీవల కొండ చరియలు ట్రాక్ మీదకు దూసుకు వచ్చిన జరతి–మాలిగుడ స్టేషన్ల మధ్య ట్రాక్ పరిశీలించారు. కొండ చరియలు పడినప్పుడు తట్టుకునే విధంగా ట్రాక్‌ల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఇదే మార్గంలో కొరాపుట్ మీదుగా జగదల్‌పూర్ మార్గం పరిశీలించారు. తిరిగి కొరాపుట్–రాయగడ మార్గం కేఆర్ లైన్‌లో పరిస్థితి సమీక్షించారు. కక్కిరి గుమ్మ రైల్వే స్టేషన్, లైలి గుమ్మ–రవులి మధ్య వంతెన, కేఆర్ లైన్ లో 15 గేట్ లెవల్ క్రాసింగ్ పరిశీలించారు. పలు చోట్ల స్టేషన్లు తనిఖీ చేశారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ గొడుగులు వేసుకొని ట్రాక్‌ల వద్దకు వెళ్లారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. పర్యటనలో వాల్తేర్ డీఆర్‌ఎం లళిత్ బోరా, అన్ని విభాగాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.