
రాష్ట్రపతి పర్యటనకు సన్నద్ధత
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15వ తేదీల్లో రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక లోక్ సేవా భవన్‌లో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం సన్నద్ధతని ఆయన సమీక్షించారు. రాష్ట్రపతి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం న్యూ ఢిల్లీ నుండి స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక వైమానిక దళం విమానంలో చేరుతారు. భువనేశ్వర్, కటక్ జంట నగరాలలో 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ నెల 14 సాయంత్రం స్థానిక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పంచమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరవుతారు. మర్నాడు 15వ తేదీ ఉదయం కటక్ రెవెన్షా విశ్వవిద్యాలయం 13వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. ఆ తర్వాత కటక్ రెవెన్షా బాలికల ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తదుపరి రాష్ట్రపతి కటక్ తులసీ పూర్ బిజూ పట్నాయక్ చక్‌లో ఉన్న సరళ భవన్‌ను సందర్శించి ఆది కవి సరళా దాస్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. సరళ సాహిత్య సంసద్ నిర్వహించే ఆది కవి సరళా దాస్ 600వ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కళింగ రత్న అవార్డు–2024ను ప్రదానం చేస్తారు.
జూలై 15వ తేదీ సాయంత్రం న్యూ ఢిల్లీకి తిరిగి పయనం అవుతారు. రాష్ట్రపతిని విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి ప్రత్యక్షంగా స్థానిక రాజ్ భవన్ చేరి రాష్ట్రపతి బస చేస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. కార్యక్రమాల వేదిక ప్రాంగణాలు, రోడ్డు ప్రయాణంలో దారి పొడవునా అత్యవసర భద్రత, రక్షణ ఏర్పాట్లు సమీక్షించారు. వేదికకు దారితీసే రోడ్ల తాజా స్థితిగతుల దృష్ట్యా అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్ల పరిశుభ్రత, వేదిక వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, తగినంత సంఖ్యలో అదనపు జనరేటర్లను ఏర్పాటు చేయడానికి సూచనలు జారీ చేశారు. రాష్ట్రపతి సందర్శన సజావుగా సాగడానికి, వివిధ సన్నాహాలకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రముఖ కార్యదర్శి అందరి సహకారాన్ని కోరారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి కమిషనర్, ప్రభుత్వ అదనపు ప్రఽముఖ కార్యదర్శి అనూ గర్గ్, హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సత్యబ్రత్ సాహు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ వైబీ ఖురానియా, సంబంధిత వివిధ విభాగాల కార్యదర్శులు, కేంద్ర రెవెన్యూ కమిషనర్లు, కటక్, ఖుర్దా జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.