
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
జయపురం: స్థానిక మహాత్మాగాంధీ రోడ్డులోని డెప్పిగుడ జంక్షన్‌లో గల సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారి నుంచి భక్తులు సాయిబాబా ఆలయానికి తరలివచ్చారు. యజ్ఞ, యాగాలు నిర్వహించారు. కొట్‌పాడ్‌లోని సాయిబాబా విగ్రహానికి ఎమ్మెల్యే రూపు భొత్ర పూజలు చేశారు.
కొరాపుట్‌లో...
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమ, మైనారిటీ వ్యవహారాల మంత్రి నిత్యానంద గోండొ గురువారం పర్యటించారు. మెయిన్ రోడ్డులోని ఎస్‌బీఐ ఎదురుగా ఉన్న అలేఖ్ బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. మత గురువు అవదూత బ్రహ్మచారి బాబాకి పాద నమస్కారం చేశారు. ఆశ్రమంలో మత పెద్దలకు కానుకలు సమర్పించారు. ఆశ్రమానికి అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పక్కనే ఉన్న సాహిద్ లక్ష్మణ్ నాయక్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గురువుగా మారి పిల్లలకు పాఠాలు చెప్పారు. వారితో కలిసి ఆటలాడారు. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ఉన్నారు. కొరాపుట్ జిల్లాలోని హరే కృష్ట మందిరాన్ని కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపు భొత్ర సందర్శించారు. గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు.
నబరంగ్‌పూర్‌లో..
నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని చైనా మార్కెట్‌లో షిర్డీ సాయి మందిరంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఉదయం పాలభిషేకం చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాద సేవనం జరిగింది. సాయంత్రం చైనా మార్కెట్, పఠాన్ వీధి, గాంధీ జంక్షన్, మెయిన్ రోడ్డు, జగన్నాథ మందిరం మీదుగా స్వామిని ఊరేగించారు. రాత్రి అల్పాహారం పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రాయగడలో..
రాయగడ: పట్టణంలోని షిర్డీ సాయి మందిరాల్లో గురుపౌర్ణమి పూజలు నిర్వహించారు. స్థానిక రైల్వే రిక్రియేషన్ మైదానం ఎదురుగా గల షిర్డీ సాయి బాబా మందిరంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. డైలీ మార్కెట్ సమీపంలో గల హనుమాన్ మందిరం ప్రాంగణంలో గల బాబా మందిరంలో విశేష పూజలు నిర్వహించారు.
పర్లాకిమిడిలో...
పర్లాకిమిడి: వ్యాస పౌర్ణమి సందర్భంగా స్థానక సరస్వతీ శిశు విద్యామందిర్‌లో విద్యార్థులతో దేవీ మఠం మహాంత రామానంద మహారాజ్ పాల్గొని వ్యాసుని చరిత్ర గురించి తెలియజేశారు. వ్యాస మహార్షిని ఆదిగురువుగా పండితులు అందరూ కోనియాడతారన్నారు. అందువల్ల ఈ రోజు గురుపౌర్ణమి అని కూడా పిలుస్తారన్నారు. రాజవీధిలోని జగన్నాథ మందిరం వెలుపల రథాల వద్ద సరస్వతీ శిశు విద్యామందిర్ విద్యార్థులు హాల్వా ప్రసాదాన్ని యాత్రికులకు పంచి పెట్టారు. శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల యోగా వేదికపై పతంజలి యోగా సమితి గురువు జిల్లా ప్రభారి భిఘ్నేశ్వర్ దాస్‌ను యోగ సమితి శిష్య బృందాన్ని ఘనంగా సత్కరించారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి