
విద్యా మందిరంలో గురుపూజోత్సవం
జయపురం: జయపురం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) విభాగం వారు ఆదివారం స్థానిక శారదా విహార్ విద్యామందిర ప్రాంగణంలో శ్రీగురు దక్షిణ ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవంలో పశ్చిమ ప్రాంత ఆర్‌ఎస్‌ఎస్ సంఘ పరిచాలక్ ప్రొఫెసర్ సనాతన ప్రధాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జయపురం పట్టణ ఆర్‌ఎస్‌ఎస్ పరిచాలక్ డాక్టర్ నిరంజన్ ప్రధాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సనాతన ప్రధాన్ ప్రసంగిస్తూ.. గురు దక్షిణ ఉత్సవం ప్రాధాన్యతను వివరించారు. ఉపాధ్యాయులు, గురువులు మనలను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది మంచి మనషులుగా సమాజానికి అందిస్తారన్నారు. అటువంటి మహానీయులైన గురువులను పూజించి వారికి గురుదక్షిణ ఇవ్వడం అనాదిగా వస్తున్న సంప్రదాయం అని వివరించారు. గురువులు పూజ్యనీయులని బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర స్వభావులన్నారు. అందుచేత గురువు మనకు విద్య నేర్పినందుకు గురు దక్షిణ ఇవ్వడం సంప్రదాయమన్నారు. ఈ రోజున మన శక్తి, సామర్‌ాధ్యలను బట్టి గురువులకు గురు దక్షిణ సమర్పించే కార్యక్రమాలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహిస్తున్నదని వివరించారు. ఈ సందర్భంగా పలువురు గురువులకు గురుదక్షణలు సమర్పించి వారి ఆశీర్వాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రముఖ ఉపాధ్యాయులు ముకుంద భోయి, సుభ్రత్ కుమార్ పండ పాల్గొన్నారు.