
స్థలం మంజూరు చేయాలని వినతి
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణ యాదవ సంఘం అభివృద్ధి, స్వంత కార్యాలయం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయాలని సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ను అభ్యర్ధించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో శ్రీకృష్ణయాదవ సంఘం అధ్యక్షులు ఎ.కులవర్దన రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో, కాశీనగర్ సమతి మాజీ చైర్మన్ సి.హెచ్. సింహాద్రి, బరంపురం ఎం.పి. ప్రతినిధి దారపు రాజేష్ కుమార్ ఉన్నారు.
జాతీయ దివ్యాంగ పోటీలకు ఎంపికలు
కాశీబుగ్గ: జిల్లాస్థాయి దివ్యాంగ సబ్ జూనియర్, జూనియర్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్–2025 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల ఎంపికలు ఈనెల 26వ తేదీన కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో జరగనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతీ దివ్యాంగ క్రీడాకారులు ఈనెల 24వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 93813 68209, 80081 62432, 91776 93836 నంబర్లను సంప్రదించాలని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం అధ్యక్ష, కార్యదర్శులు తురల్లి రాము, డి.అచ్యుతరావు, కార్య నిర్వాహక సభ్యులు ఎన్.స్రవంతి, ఎన్.మోహన్‌రావు, గణపతి, నీలం తదితరులు కోరారు.
ఉర్లాం స్కూల్‌లో చోరీ
నరసన్నపేట: మండలంలోని ఉర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.40 వేలు విలువ కలిగిన పరికరాలు చోరీకి గురయ్యాయని హెచ్‌ఎం భారతి సోమవారం తెలిపారు. మరుగుదొడ్లలో ఉన్న విలువైన స్టీల్ ట్యాప్‌లు, ఇతర పరికరాలు చోరీ చేశారన్నారు. శని, ఆదివారాలు వరుసగా స్కూల్‌కు సెలవులు కావడంతో గుర్తు తెలియన వ్యక్తులు తాళాలు విరగ్గొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాడు–నేడు పథకంలో భాగంగా ఈ పాఠశాలలో అత్యుత్తమ సదుపాయాలు కల్పించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
రణస్థలం: లావేరు మండలంలోని జాతీయ రహదారి బెజ్జిపురం కూడలి సమీపంలో ఉన్న హైవే విశ్రాంతి భవనంలో బెజ్జిపురం గ్రామానికి చెందిన శివాజీ(54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతిపై కుటుంబ సభ్యులు అందోళన చేపట్టారు. సంఘటన స్థలాన్ని లావేరు ఏఎస్‌ఐ భుజంగరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతిడికి భార్య సబ్బి ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.