
ఉపాధ్యాయుల గృహదీక్ష
రణస్థలం: డీఎస్సీ–2003 ఫోరం పిలుపు మేరకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 2003 బ్యాచ్ ఉపాధ్యాయులు గృహ దీక్ష చేపడుతున్నారని ఆపస్ మండల అధ్యక్షుడు జి.చిన్నికృష్ణంనాయుడు, పీఆర్‌టీయూ మండల ప్రధాన కార్యదర్శి బి.చిన్నంనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో 57 మేరకు అర్హత కలిగిన అందరికి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించే శాంతియుత నిరసనకు కుటుంబ సమేతంగా అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.
దుండగులను కఠినంగా శిక్షించాలి
జి.సిగడాం: డి.ఆర్.వలసలో ఈ నెల 12న శనీశ్వరుడి ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు కోరారు. ఆదివారం ఆలయంలో విగ్రహాల పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని సర్పంచ్ కుమరాపు శ్రీనివాసరావు, ఎంపీటీసీ కుమరాపు రమేష్‌నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, ఆలయ శిల్పి కుమరాపు రామినాయుడు, కుమరాపు చిన్న శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
సారవకోట : పెద్దలంబ పంచాయతీ కురమన్నపేటకు చెందిన కలుగు నారాయణరావు(39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం నారాయణపురం నుంచి పాతపట్నం మండలం కొయ్యకొండ వెళ్లే మార్గంలోని మామిడి తోటలో మేకలు, గొర్రెలకాపరులు ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించారు. స్థానికులకు సమాచారమివ్వగా వారు సారవకోట పోలీసులకు సమాచారమిచ్చారు. వ్యక్తి మృతిచెంది రెండు, మూడు రోజులు కావడంతో గుర్తుపట్టలేని విధంగా మారింది. కొద్దిసేపటి తర్వాత కురమన్నపేటకు చెందిన నారాయణరావుగా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. నారాయణరావుకు భార్య హిమవతి, కుమార్తెలు ఉష, లలిత ఉన్నారు. నారాయణరావు నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటోంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అనిల్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
సారవకోట: అంగూరు గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అడ్డపనస గ్రామానికి చెందిన వెలమల రామారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. చల్లవానిపేట నుంచి వెంకటాపురం వైపు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న రామారావు గాయపడటంతో 108 వాహనంలో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి
● అధికారి వేధింపులే
కారణమంటున్న బంధువులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో పనిచేస్తూ ఇటీవల జరిగిన బదిలీల్లో సిలగాంకు బదిలీ అయిన ఉడుకుల రాంబాబు (44) ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆకస్మిక బదిలీ, ఒత్తిళ్లే ఇందుకు కారణమని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. రాంబాబు ఈ నెల 7 వరకు శ్రీకాకుళం బాలుర వసతి గృహంలోనే పనిచేశారు. వాస్తవంగా బదిలీ అయ్యే అవకాశం లేకపోయినా అక్కడి సంక్షేమాధికారి సిఫారసులు, వేధింపుల వల్ల రాంబాబును బదిలీ చేశారని, బదిలీ వద్దని ఎంత మొరపెట్టుకున్నా కనికరించలేదని బంధువులు చెబుతున్నారు. వసతి గృహ సంక్షేమాధికారి చెప్పిన మాటలు విని వాస్తవిక పరిస్థితులు తెలుసుకోకుండా బీసీ సంక్షేమాధికారిణి అడ్డగోలుగా బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు స్వస్థలం విజయనగరం జిల్లా డెంకాడ మండలం పాలెం గ్రామం. భార్య రమాదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఉపాధ్యాయుల గృహదీక్ష

ఉపాధ్యాయుల గృహదీక్ష