
ఎస్పీగా వెళ్లి డీఐజీగా రాక
కొరాపుట్: సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీగా కన్వర్ విశాల్ సింగ్‌ని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విశాల్ గతంలో కొరాపుట్ ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్విస్టిగేషన్ వింగ్‌లో డీఐజీగా పని చేస్తున్నారు. మళ్లీ డీఐజీ హోదాలో కొరాపుట్ జిల్లా కేంద్రం రానునున్నారు. ప్రస్తుతం సదరన్ వెస్ట్రన్ రేంజ్ డీఐజీగా ఉన్న అఖిలేశ్వర్ సింగ్ తిరిగి విశాల్ సింగ్ విధులు నిర్వరిస్తున్న ఇన్విస్టిగేషన్ వింగ్ డీఐజీగా వెళ్తారని ప్రభుత్వం ప్రకటించింది. కన్వర్ విశాల్ సింగ్ కొరాపుట్‌లో ఎస్పీగా పనిచేసి తిరిగి అదే కొరాపుట్‌కి డీఐజీగా రావడం గమనార్హం.
దాతృత్వం చాటుకున్న శ్రీనివాసరావు
కొరాపుట్: సామాజిక సేవకు సరిహద్దులు ఉండవని సామాజిక మాధ్యమాలు ఉంటే చాలని ఈ సంఘటన నిరూపించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పేదలకు నబరంగ్‌పూర్ జిల్లాలోని చైనా మార్కెట్‌కి చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ కొత్తకోట శ్రీనివాసరావు వితరణ చేశారు. ఆమదాలవలసలో గత 526 రోజులుగా పేదలకు నిరవధికంగా ఉచిత మధ్యాహ్న భోజన వితరణ జరుగుతోంది. అయితే ఇటీవల భారీ వర్షంలో పేదలు ఆహారం తీసుకుంటున్న చిత్రం వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన శ్రీనివాసరావు చలించారు. వెంటనే నిర్వాహకులతో మాట్లాడి పేదలందరికీ నాణ్యమైన గొడుగులు, ఒక రోజు ఆహారం, స్వీట్లు అందజేయాలని సూచించారు. అవసరమైన ఆర్థిక సాయం పంపించారు. సాయి భక్తుడైన శ్రీను గురు పౌర్ణమి సందర్భంగా 527 రోజు అక్కడి వారందరికీ గోడుగులు, ఆహారం పంపిణీ చేయించారు.
ఏసీఎఫ్ భార్యపై హత్య కేసు విచారణ కొనసాగాల్సిందే: హై కోర్టు
భువనేశ్వర్: ఏసీఎఫ్ సౌమ్య రంజన్ మహాపాత్రో మరణానికి సంబంధించి అతని భార్య బిద్యా భారతి పండా వ్యతిరేకంగా నమోదైన హత్యారోపణ కేసు విచారణ కొనసాగాల్సిందేనని రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పర్లాకిమిడి ఎస్‌డీజేఎం న్యాయస్థానం ఆదేశించిన ప్రకారం ఈ కేసు విచారణ కొనసాగించాలని రాష్ట్ర హై కోర్టు స్పష్టం చేసింది. పర్లాకిమిడి ఎస్‌డీజేఎం న్యాయ స్థానం జారీ చేసిన ఆదేశాల్ని కొట్టివేయాలని నిందిత భార్య బిద్యా భారతి పండా రాష్ట్ర హై కోర్టుని ఆశ్రయించింది. ఆమె అభ్యర్థనని ఉన్నత న్యాయ స్థానం తిరస్కరించి తదుపరి విచారణ నిరాటంకంగా కొనసాగాలని ఆదేశించింది. నిందితురాలికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్లు 285, 304–ఎ కింద విచారణ కొనసాగుతుంది. 302, 120బి సెక్షన్లు కింద ప్రత్యేక ఫిర్యాదు ద్వారా లేవనెత్తిన ఆరోపణలపై విచారణను ప్రారంభ దశలో కొట్టివేయాలనే అభ్యర్థన పట్ల ఉన్నత న్యాయ స్థానం ప్రతికూలంగా స్పందించింది. ఈ సెక్షన్ల కింద లేవనెత్తిన ఆరోపణలపై సమగ్ర పరిశీలన విభిన్న వాస్తవ వివాదాలను ధృవీకరించే అవకాశం ఉందని రాష్ట్ర హై కోర్టు అభిప్రాయపడింది. తీవ్రంగా భిన్నమైన కథనాలు, వివాదాస్పద వాస్తవాల ఉనికిని దృష్టిలో ఉంచుకుని ట్రయల్ కోర్టు సాక్ష్యాలను లోతుగా పరిశీలించడం సముచితమని హై కోర్టు పేర్కొంది. హై కోర్టు జారీ చేసిన పరిశీలనల్ని ప్రభావితం చేయకుండా పిటిషనర్ (బిద్యా భారతి) ట్రయల్ కోర్టు ముందు విడుదల కోరడం వంటి అభ్యర్థనల్ని ప్రవేశ పెట్టేందుకు పూర్తి స్వేచ్ఛ కల్పించినట్లు ఉన్నత న్యాయ స్థానం వెసులుబాటు కల్పించింది.
దొంగను పట్టించిన ప్రజలు
జయపురం: దొంగతనం చేసేందుకు ఒక ఇంటిలో చొరబడిన దొంగను ఆ ప్రాంత ప్రజలు చుట్టు ముట్టి పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. ఈ సంఘటన జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ సమితి శాంతినగర్‌లో జరిగింది. బుధవారం రాత్రి ఒక దొంగ బొరిగుమ్మ శాంతినగర్ నివసిస్తున్న బులు పాఢీ ఇంటిలో ప్రహరీ దూకి ఇంటిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇంటి యజమాని భార్య శబ్ధం విని తలుపు తెరిచి చూడగా దుండగుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. ప్రహరీపై ఉన్న మేకులు గుచ్చుకోవడంతో ఒక మూల దాక్కున్నాడు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.