
మరో మారు మన్మోహనే అధ్యక్షుడు
● నేడు అధికారిక ప్రకటన
భువనేశ్వర్: మన్మోహన్ సామల్ మరో మారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టనున్నారు. దాదాపు ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మండలి సభ్యుల ఎన్నిక కోసం సోమవారం నామినేషన్ పత్రాల దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి మన్మోహన్ సామల్ ఒక్కరు మాత్రమే నామినేషను దాఖలు చేశారు. నామినేషను దాఖలు గడువు ముగిసే సరికి ఈ ఒక్క నామినేషన్ పత్రమే దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా స్పష్టం అవుతుంది. మంగళ వారం తుది ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల నిర్వహణ అధికారులు తెలిపారు. కేంద్ర మండలి సభ్యత్వానికి 32 నామినేషను పత్రాలు దాఖలు అయ్యాయి. రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి పోటీ కి నామమాత్రంగా ఒకే ఒక్క నామినేషన్ పత్రం దాఖలైందని ఎన్నికల పర్యవేక్షకునిగా నియమితులైన సంజయ్ జయస్వాల్ తెలిపారు.
మన్మోహన్ దక్షతకు పట్టం
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకలాపాల్లో మన్మోహన్ సామల్ దక్షత రాష్ట్ర, కేంద్ర కార్యవర్గ ప్రముఖుల్ని ఆకట్టుకుంది. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరి నమ్మకాన్ని ఆయన కూడగట్టుకుని రెండోసారి వరుసగా అధ్యక్షునిగా ఎన్నిక అయ్యేందుకు మార్గం సుగమం చేసుకోవడం విశేషం. ప్రధానంగా రాష్ట్రంలో తొలి సారి పాలన పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీకి అంతర్గత సమస్యలు ఏమాత్రం అడ్డంకి కాకుండా అధ్యక్షుని హోదాలో మన్మోహన్ సామల్ దక్షత రాజకీయ ప్రముఖుల ప్రసంశలు అందుకుంది. మరో మూడేళ్లు ఆయన ఈ పదవీకాలంలో కొనసాగుతారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లకు కీలక అధిపతుల నియామకం వివాదరహితంగా పూర్తి అయి పార్టీ మనుగడని మరింత బలోపేతం చేసే దిశలో మన్మోహన్ చాతుర్యం ప్రదర్శిస్తారని బీజేపీ రాష్ట్ర సభ్యులు విశ్వసిస్తున్నారు.
ఇదివరకు 1999 నుంచి 2004 సంవత్సరం వర కు పార్టీకి సారథ్యం వహించారు. తదుపరి 2023 మార్చి 23న మరో మారు అధ్యక్షునిగా బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన సారథ్యంలో పార్టీ అగ్ర శ్రేణి ఆదేశాలు, మార్గదర్శకాలు క్షేత్ర స్థాయిలో వాస్తవ కార్యాచరన, అమలు చర్యల తో అధిష్టానం దృష్టిలో దక్షత పరుడుగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. బూత్ స్థాయి, అట్టడుగు స్థాయిలో పార్టీ ఉనికి బలోపేతంలో ఆయనకు ఆయనే సాటిగా మన్ననలు పొందారు.
గత సంవత్సరం ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ మొదటిసారి ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 20 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి ఇదో ఊహాతీతమైన విజయం. సుదీర్ఘంగా అధికారంలో కొనసాగిన బిజూ జనతా దళ్ విపక్ష హోదాకు దిగజారింది. ఈ ఫలితాలతో బీజేడీ భారత పార్లమెంటులో దాదాపు ఉనికిని కోల్పోయింది. ఈ విజయంతో మన్మోహన్ సామల్ నాయకత్వంలో పురోగతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె. పి. నడ్డా వంటి జాతీయ ప్రముఖుల విశ్వాసం బలపడింది. రాష్ట్రంలో డబుల్‌ఇంజిన్ సర్కారుని కేంద్రంతో చక్క ని సమన్వయంతో రాష్ట్ర సమగ్ర పురోగతిని వ్యూహాత్మకంగా నిర్వహించడం రాష్ట్రంలో తొలి సారిగా పాలన పగ్గాలు చేపట్టిన మోహన్ చరణ్ మాఝి సర్కారుకు చేదోడు వాదోడుగా మన్మోహన్ సామల్ అధ్యక్షత కొండంత బలంగా నిలుస్తుంది.