
వందేభారత్ కొరాపుట్ వరకు పొడిగించండి
● జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహనీ పతి
కొరాపుట్: భువనేశ్వర్–విశాఖ మధ్య ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైల్‌ను అరుకు మీదుగా కొరాపుట్ వరకు పొడిగించాలని జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహనీ పతి కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం విజ్ఞపనతో కూడిన లేఖను రాశారు. వందేభారత్ రైల్ రోజూ 800 కిలోమీటర్లలోపు, రెండు వైపులా సుమారు 1600 కిలోమీటర్లు ప్రయాణించాలన్నారు. కానీ భువనేశ్వర్–విశాఖ మధ్య దూరం 440 కిలోమీటర్లు ఉందన్నారు. విశాఖపట్నం నుంచి కొరాపుట్‌కి 215 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. అందువలన రైల్‌ను పొడిగించినా నష్టం లేదన్నారు. ప్రస్తుతం వందేభారత్ రైలు రోజుకి సుమారు 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి విశాఖలో నాలుగు గంటలు, భువనేశ్వర్‌లో ఆరేడు గంటలు ఉండి పోతుందన్నారు. కావున ఇలా పొడిగిస్తే కొరాపుట్ ప్రాంతానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పెరిగి అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. ప్రస్తుతం కొరాపుట్ నుంచి భువనేశ్వర్‌కి నడుస్తున్న హిరాఖండ్ రైలు 680 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందన్నారు. అదే అరుకు మీదుగా భువనేశ్వర్ 657 కిలోమీటర్ల దూరం ఉందన్నారు. పగటి పూట నడిచే భువనేశ్వర్–విశాఖ వందే భారత్ ని అరుకు మీదుగా కొరాపుట్‌కు నడిపాలని విజ్ఞప్తి చేశారు. తన వినతి పత్రాన్ని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మెంద్ర ప్రదాన్‌కి పంపించారు.
దేవకుపిలిని పంచాయతీగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి కుముడాబల్లి పంచాయతీ పరిధిలో గల దేవకుపిలిని పంచాయతీగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బీడీఓ కృష్ణచంద్ర దళపతికి వినతిపత్రం అందించారు. జనాభా పరంగా అభివృద్ధి చెందుతున్న దేవకుపిలిని పంచాయతీగా గుర్తించాలన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో కుముడాబల్లి సర్పంచ్ గౌరి పిడిక, గ్రామస్తులు ఉన్నారు.

వందేభారత్ కొరాపుట్ వరకు పొడిగించండి