కొట్‌పాడ్‌లో రబీ మండీలు ప్రారంభం
జయపురం: వర్షాకాలం ప్రారంభం కాక ముందే మండీలకు వచ్చిన ధాన్యాన్ని ఖరీదు చేయాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితిలో కొట్‌పాడ్, బొబాయి లలో శనివారం జయపురం రెగ్యులేటింగ్ మార్కెటింగ్ కమిటీ వారు రబీ ధాన్యం మండీలను ప్రారంభించారు. ఈ మండీల్లో బొబాయి, నువాగాం,ఘుమరా పంచాయతీల సర్పంచ్‌లు, రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు. బొబాయి మండీ వారంలో మూడు దినాలు ఉంటుందని, రోజుకు 3 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని ఆర్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. క్వింటాల్ ధాన్యం రూ.3,100కు ఖరీదు చేస్తారని పేర్కొన్నారు. డీఎల్‌సీ సమావేశంలో మే 25 నుంచి మండీలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ధాన్యం బస్తాలు ఉంచేందుకు ప్లాట్ ఫారంలు లేని మండీలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లేంప్స్, ఆర్.యం.సిలు దృష్టి సారించాలని రైతులు కోరారు. మండీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రైతులు, రైతు ప్రతినిధులు అధికారులను కోరారు.


