ప్రధాని మోదీ పర్యటన వాయిదా
భువనేశ్వర్: రాష్ట్రంలో తొలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి పురస్కరించుకుని వార్షికోత్సవం సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష హాజరు కోసం పార్టీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఇటీవలి ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ వార్షికోత్సవానికి హాజరు కావాలని భారత ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర పార్టీ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు కేంద్రం నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం వార్షికోత్సవానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీన రాష్ట్రంలో బీజేపీ సర్కారు వార్షికోత్సవం నిర్వహణ కోసం భారీ సన్నాహాలు చేశారు. అయితే ఇంతలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రోజు హాజరు కాలేని పరిస్థితుల దృష్ట్యా, ఈ నెల 20న విచ్చేసేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. లోగడ ఈనెల 12వ తేదీన జరగబోయే వార్షికోత్సవానికి విచ్చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ప్రధానమంత్రి పర్యటనలో మార్పు చోటు చేసుకుందని రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు. అందువలన జూన్ 12న జరగాల్సిన ప్రధాన వార్షికోత్సవ కార్యక్రమాన్ని జూన్ 20కి వాయిదా వేశామని మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు.


