
వ్యాపారి కిడ్నాప్ గుట్టురట్టు
జయపురం: జయపురం వ్యాపారి డీసీ రాజు కిడ్నాప్ చిక్కుముడిని పోలీసులు విప్పారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో జయపురం సబ్‌డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీస్ కశ్యప్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. అరెస్టయిన నిందితులు బొరిగుమ్మ సమితి బిసింగపూర్ పోలీసు స్టేషన్ పరిధి రంపుడిపొదర గ్రామం కమర దిశారి(25), కమరాగుడ గ్రామం కమళ లోచన హరిజన్ ఉరప్ దుబులు(25), జయపురం సదర్ పోలీసు స్టేషన్ ఉమ్మరి పంచాయితీ మొకాపుట్ సురేంధ్ర ఖోశ్ల(25), సనముజురుముండ గ్రామం దేవేంధ్ర నాగ్(26), ఉమ్మిరీ గ్రామం ప్రతాప్ బెహర(26), ఉమ్మిరి గ్రామం కరణ నాయి(20) లు అని వెల్లడించారు. వారి నుంచి ఒక నాటు తుపాకీ మూడు పేల్చని మూడు తూటాలు, బంగారం, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన కేసు వివరాలు వెల్లడిస్తూ గత మార్చి నెల 21న వ్యాపారి రాజును కిడ్నాప్ చేశారని ఆ మేరకు అతని కుమారుడు ఎ.పవన్ కుమార్(31) ఫిర్యాదు చేశారని వెల్లడించారు. వెంటనే తాము దర్యాప్తు ప్రారంభించామని, దుండగులు డీసీ రాజుని నాలుగు చక్రాల వాహనంలో ఘాట్‌గుడ నుంచి బిసింగపూర్ రామపుడి పొదర్ వద్ద పర్వత శిఖరంపైకి తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ రాజు వద్ద నుంచి నగదు, బంగారం, మొబైల్ లాక్కున్నారని, బాధితుడిని మరో ప్రాంతానికి తీసుకుపోవాలనుకున్న సమయంలో అతడు తప్పించుకున్నారని తెలిపారు. పోలీసులు ఆ ప్రాంత ప్రజలను విచారించగా వివరాలు తెలిశాయన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితునితో పాటు కొంత మంది పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.

వ్యాపారి కిడ్నాప్ గుట్టురట్టు