విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు.
ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన
వేపాడ: మండలంలోని బానాది గ్రామంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరుగు ప్రదర్శనలో 12 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో రామన్న పాలెంకు చెందిన విక్రమ్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచి రూ.12 వేలు, రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెర్సీ నిలిచి రూ. పదివేలు సాధించాయి. మూడో స్థానంలో రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక గుర్రం, నాల్గో స్థానంలో ఎల్.కోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం నిలిచి నగదు బహుమతులు సాధించాయి. విజేతలకు ఆలయ ధర్మకర్తలు, పెద్దలు కమిటీ సభ్యులు నగదు బహమతులు అందజేశారు.
‘గేట్’ లో కార్తికేయ కుశల్ కుమార్‌కు 79వ ర్యాంక్
విజయనగరం అర్బన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్–2025) ఫలితాల్లో పట్టణ విద్యార్థి గంట కార్తికేయ కుశల్ కుమార్ జాతీయ ర్యాంక్ 79 సాధించాడు. గేట్‌లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) సబ్జెక్టులో 842 స్కోర్‌తో 79వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కార్తికేయ బీటెక్ కాలికట్ ఎన్‌ఐటీలో చదివాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించిన కార్తికేయ తండ్రి జి.సునీల్ కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి శోభ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని.
పోక్సో కేసులో 12 ఏళ్ల జైలుశిక్ష
భామిని: మండలంలోని బిల్లుమడకు చెందిన మండల శివ అనే ముద్దాయికి పోక్సో కేసులో విచారణ అనంతరం శుక్రవారం 12 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించినట్లు బత్తిలి ఎస్సై డి.అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో బిల్లుమడ గ్రామంలో ఓ చిన్నారిపై మండల శివ అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా న్యాయమూర్తి విచారణ అనంతరంనేరారోపణ నిర్ధారించి శిక్ష విధించినట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సీతంపేట: మండలంలోని మాసడుగూడ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొట్టుకోవడంతో ఎస్.గణపతి, మనోజ్‌లకు గాయాలు కాగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించడంతో మెరుగైన వైద్యం కోసం గణపతిని రిమ్స్‌కు రాఫర్ చేసినట్లు ఏరియా ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి బి.శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు.
అదృశ్యం కేసు నమోదు
పార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల గ్రామానికి చెందిన నీలయ్య జనవరి 20 నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. బంధువులు, పరిచయస్తుల ఇళ్ల వద్ద భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందంటూ భార్య ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వివాహిత ఆత్మహత్య
పార్వతీపురం రూరల్: వివాహమైన ఏడాదికే అత్తవారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై ఎస్సై బి.సంతోషి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బొడ్డవలస గ్రామానికి చెందిన నాదెళ్ల లీలాసత్య(36) అత్తవారింట్లో వరకట్నం వేధింపులు, అవమానాలు తాళలేక ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డినట్లు మృతురాలి తండ్రి నాదెళ్ల దుర్గారావు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు మృతురాలి భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే